తాత్కాలిక రాజధాని ప్రారంభం: అమరావతి స్టాఫ్‌కు బాబు బంపర్ ఆఫర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాజధాని నగరంలో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు మాత్రమే ఉంటాయని చెప్పారు. దానికితోడు 30 శాతం హెచ్ఆర్ఎ కూడా ఇస్తామని చెప్పారు.
రాజధానిలో ఉండే రైతులకు 50 చదరపు గజాల భూమి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ చిన్న అసమ్మతి వచ్చినా నష్టపోయేది రైతులేనని తెలిపారు. రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని, సీబీఐ విచారణ కొనసాగించాలని కొందరు అంటున్నారని, సిబిఐ విచారణకు పోతే 20 ఏళ్లయినా తేలదని, దీంతో రైతులు ఇబ్బందుల్లో పడతారని చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, రాజధాని ప్రాంత పేదలు బాగుపడాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లుఆయన చెప్పారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయాన్ని సోమవారం తెల్లవారు జామున 4.01 గంటలకు ఆయన ప్రారంభించారు. నాలుగో బ్లాక్‌లోని రెండు గదులను ప్రారంభించి విశ్వక్సేన పూజ, వాస్తు పూజ, గణపతి హోమాలు నిర్వహించారు.
జూన్‌లో మంచి రోజులు లేనందున ఈ రోజే సచివాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. జూన్ 15 నాటికి సచివాలయ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కార్యాలయం లేకపోతే బస్సులోనే ఉండి పనిచేశానని చెప్పారు. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామని చెప్పారు.
ప్రపంచంలోని పది ఉత్తమ రాజధానుల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా నగరాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతి సీడ్ క్యాపిటల్ విలువైన ప్రాంతంగా మారబోతోందని చెప్పారు. 2018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. 2020 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలవాలని, 2029 నాటికి అగ్రస్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే సింగపూర్‌కు వెళ్లి రాజధాని మాస్టర్‌ప్లాన్ ఇవ్వాలని కోరినట్లు గుర్తు చేశారు. తన విజ్ఞప్తిని మన్నించి సింగపూర్ ఆరు నెలల్లోనే మాస్టర్‌ప్లాన్ తయారుచేసి ఇచ్చిందన్నారు. విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు. విభజించే ముందు కనీసం మనల్ని పిలిచి మాట్లాడకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. దేశంలో నదుల అనుసంధానం కలను ఆంధ్రప్రదేశ్ సాకారం చేసిందని, పట్టిసీమ ఎత్తిపోతలను కేవలం ఏడాదిలోనే పూర్తి చేసి ఈ ఘనత సాధించినట్లు చంద్రబాబు తెలిపారు.
ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్రం 10 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు. సమర్థ, నీతివంతమైన పాలనకు ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications