మాఫీపై బాబు: టితో కలహమొద్దు, పాలనపై చర్చించి..
విజయవాడ: పంట రుణాల మాఫీకి సంబంధించి ప్రతి కుటుంబానికి ఒక రుణం రద్దు అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం స్పష్టం చేశారు. 2014 ఏప్రిల్ 1వ తేదీ లోపు తీసుకున్న రుణాలకు మాఫీ పథకం వర్తిస్తుందని చెప్పారు. తొలుత రుణాల రీషెడ్యూల్ మాత్రమే చేసి ఆ తర్వాత వెసులుబాటును బట్టి ప్రభుత్వం రద్దయిన రుణాల మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుందని ఆయన ప్రకటించారు.
శనివారం రాత్రి ఇరిగేషన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఏపీకి రూ.15,900 కోట్ల లోటు బడ్జెట్ ఉంటుందన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి సమకూర్చాల్సి ఉంటుందన్నారు. రెండు రాష్ట్రాల విభజన అనంతరం అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప పోట్లాటలు, విద్వేషాలకు దిగరాదని హితవు పలికారు.

రెండు ప్రాంతాల అభివృద్ధిపై తనకు ఒక నిబద్ధత ఉందన్నారు. హైదరాబాద్ కూడా పెరగాలని చెబుతూ ప్రపంచం విశాలమైనదని, పెట్టుబడులకు కొదువ లేదని, జపాన్, మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల నుంచి నేరుగా ఆంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టటానికి వస్తున్నారని, పెట్టుబడులు రాబట్టడంలో పోటీ పడాలన్నారు.
పరిపాలన మొత్తం హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలి రావటానికి కొంత సమయం పడుతుందని, ఈలోగా అవసరం అనుకుంటే తాను టెంట్ వేసి అయినా కూర్చుని పని చేసే ఆలోచన ఉన్నదన్నారు.
హైదరాబాద్ నుంచి నేను ఎటు వెళ్ళాలన్నా 170 -200 కిలోమీటర్లు వెళితే కానీ పరిపాలనా ప్రాంతాలకు రాలేక పోతున్నానని, హైదరాబాద్‌లో కూర్చోవటానికి స్థలం లేదని, సెక్రటేరియట్ ఇంకా సెట్ అవలేదని, అలా అని వెంటనే ఇక్కడకు వచ్చి పని చేద్దామంటే.. ఇక్కడి సమస్యలు ఇక్కడ ఉన్నాయన్నారు.
సిబ్బంది, అధికారులు తరలి రావాలని, అందుకు అనువైన వసతులు, కార్యాలయ భవనాలు కావాలని, ఉద్యోగులు తరలి రావటానికి అంతగా ఇష్టపడరని, పిల్లల చదువులు, ఇతరత్రా సమస్యలు ఉంటాయని, రోడ్డు, విమాన రవాణా ఇంకా పెరగాలని, రాజధాని విషయం కూడా తేలటానికి ఇంకొంత సమయం పడుతుందని, కమిటీ నివేదిక రాగానే రాజధాని ఖరారు అవుతుందని, ఆ తర్వాత అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. జిల్లాలలో వారానికి రెండు రోజులు పర్యటిస్తానని చెప్పారు. పాలన ఎక్కడి నుండో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.












Click it and Unblock the Notifications