లోకేష్ వల్లే ప్రధాని పదవి చేపట్టలేదు: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడులో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కుమారుడు నారా లోకేశ్ సలహాతోనే ప్రధాని పదవిని వదులుకున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు. 1996లో జ్యోతిబసు, తాము భాగస్వాములుగా ఉన్న థర్డ్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవి చేపట్టాలని సంకీర్ణ నాయకులు తనను కోరారని చంద్రబాబు చెప్పారు.
'అది తాత్కాలిక పదవి' అని తన కుమారుడి చెప్పడంతో ప్రధాని పదవిని వదులుకున్నానని వెల్లడించారు. టీడీపీ మహానాడు సందర్భంగా శనివారం రాత్రి జర్నలిస్టులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. ఈ విషయం చెప్పారు.
యునైటెట్ ఫ్రంట్ ఏర్పాటుకు తామెంతో కృషి చేశామని తెలిపారు. ప్రధాని పదవికి చేపట్టమని కూటమిలోని చాలా మంది నాయకులు తనను కోరారని, కానీ తాను ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పారు.
'జ్యోతిబసు, మరికొంత మంది మరోసారి అడిగారు. అప్పటికి లోకేశ్ తొమ్మిదో, పదో చదువుతున్నాడు. 'ప్రధాని పదవి చేపట్టవద్దని, అది తాత్కాలిక పదవి' అని నాకు లోకేష్ సలహాయిచ్చాడు. దీంతో నేను వెనక్కు తగ్గాను' అని చంద్రబాబు వెల్లడించారు.

లోకేశ్ గురించి మహానాడులో చివరిరోజు ఏదైనా ప్రకటన చేయబోతున్నారా? అని ప్రశ్నించగా.. ఆదివారం ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పని అన్నారు. కానీ, పార్టీలో ప్రతిభను పోత్సాహిస్తామని చంద్రబాబు సమాధానం ఇవ్వడం గమనార్హం.
కాగా, తెలుగుదేశం పార్టీ నేతకలు పలు సూచనలు చేశారు చంద్రబాబు. టిడిపి నేతల్లో చాలా మంది ఫోటోలు తీయించుకునేందుకు చెట్లను నాటుతూ, ఆపై వాటిని గురించి పట్టించుకోవడం లేదని తనకు తెలిసిందని, ఇకపై అలా జరిగితే చూస్తూ ఊరుకోబోనని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
నాటే ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయించనున్నానని, దాని ద్వారా ప్రతి ఆరు నెలలకూ చెట్ల చిత్రాలను తెప్పించి వాటిని పరిశీలిస్తుంటానని వెల్లడించారు. రాష్ట్రంలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాల్సి వుందని, ఇందుకు ప్రతి కార్యకర్తా సహకరించాలని చంద్రబాబు కోరారు.
ఈ సందర్భంగా జలసంరక్షణ, చెట్ల పెంపకంపై మహానాడుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఓ మొక్క నాటాలని, ఎవరైనా చనిపోతే కూడా వారి జ్ఞాపకార్థం ఓ మొక్క నాటి దాన్ని సంరక్షించుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.












Click it and Unblock the Notifications