ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలొద్దు-టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్ధుల్ని గెలిపించాలన్న చంద్రబాబు..
ఏపీలో ఎల్లుండి జరిగే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు చంద్రబాబు ఇవాళ బహిరంగ లేఖ రాశారు.
ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఎల్లుండి జరిగే ఈ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడే అవకాశముందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వాటిని ఎదుర్కొని టీడీపీకే ఓటు వేయాలని చంద్రబాబు బహిరంగ లేఖలో ఓటర్లను కోరారు.
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ కి బుద్ది చెప్పి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని బహిరంగ లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలు, బోగస్ ఓట్లతో వైసీపీ పాల్పడుతున్న అక్రమ విధానాలను చంద్రబాబు తన లేఖలో వివరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా రెండో ప్రాధాన్య ఓటు పరస్పర బదిలీపై ఓటర్లకు పిలుపు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చామని, నాడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువత భవితకు బాటలువేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయి నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. జాబ్ క్యాలెండర్, డీఎస్సీ గురించి ప్రభుత్వం ఎలా మోసం చేసిందో చూశామన్నారు జగన్ ప్రభుత్వం తమ హక్కులను హరిస్తూ తమను ఎలా మోసం చేసిందో ఉద్యోగులు, టీచర్లు గుర్తించి ఈ ఎన్నికల్లో వైసిపికి బుద్ది చెప్పాలన్నారు.
నాడు విభజన కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్మెంట్ కాదు కదా...కనీసం ఏనెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద డ్యూటీలు వేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో టీచర్లు బుద్ది చెప్పాలన్నారు. స్ధానిక సంస్థల ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు వైసీపీ తెరతీసిందన్నారు.

దొంగ అడ్రస్ లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారన్నారు. ఒక్క తిరుపతి నగరంలోనే 7 వేల పైగా దొంగ ఓట్లు చేర్పించారని ఆరోపించారు. మూడు పట్టభద్రలు ఎన్నికల ఓటర్ల జాబితాలో 20-30 శాతం వరకు దొంగ ఓట్లు ఉంటాయని పరిశీలనలో తేలిందన్నారు. దొంగ సర్టిఫికెట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు పొందటం తీవ్ర నేరం. దీనికి పాల్పడినవారు శిక్షార్హులవుతారని చంద్రబాబు గుర్తుచేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మేము పిడిఎఫ్ తో ఒక అవగాహనకు వచ్చామన్నారు. పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి....రెండో ప్రాధాన్య ఓటు పీడిఎఫ్ అభ్యర్థులకు వేయాలని ప్రజలను, మా మద్దతుదారులను కోరుతున్నామన్నారు.

ఇదే సందర్భంలో పిడిఎఫ్ అభ్యర్ధులకు ఓటు వేసిన ఓటర్లను వారి రెండో ప్రాధాన్య ఓటు మాకు వేయాలని కోరుతున్నామన్నారు. ఓటు చీలిపోవడం ద్వారా దుర్మార్గమైన వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోను గెలవడానికి వీలు లేదన్నారు. అందుకే రెండో ప్రాధాన్య ఓటు విషయంలో పరస్పర మార్పిడి జరగాల్సి ఉందన్నారు. పతనం అంచులో ఉన్న మన రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో, చైతన్యం తో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులు, పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications