జేపీ రీ ఎంట్రీతో మేలెవరికి ? చంద్రబాబు రుణం తీర్చుకుంటారా ? జగన్ కు సాయపడతారా ?
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న పోరులోకి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు జయప్రకాష్ నారాయణ పార్టీ లోక్ సత్తా సిద్ధమవుతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో లోక్ సత్తా ఉద్యమం రూపంలో ప్రభావం చూపిన జేపీ.. ఆ తర్వాత కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఓసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్ధితుల్లో నిక్కచ్చిగా మాట్లాడతారని పేరున్న జేపీ.. తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీకి వెళ్లినప్పుడు ఆయనపై టీఆర్ఎస్ నేతలు దాడి కూడా చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిన జేపీ.. ఇప్పుడు ఏపీలో ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.

జయప్రకాష్ నారాయణ
జయప్రకాష్ నారాయణ. ఏపీలో సుపరిచితమైన పేరు. ఒకప్పుడు డాక్టర్ గా, ఆ తర్వాత ఐఏఎస్ గా, అనంతరం లోక్ సత్తా ఉద్యమ వ్యవస్ధాపకుడిగా, చివరికి లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన జయప్రకాష్ నారాయణ్ కు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులపై పూర్తి అవగాహన ఉంది. అంతకు మించి ఇక్కడి రాజకీయ నాయకులతో పెనవేసుకున్న బంధం కూడా ఉంది. ఒకప్పుడు సమాచార హక్కు చట్టం కోసం జాతీయ స్ధాయిలో యూపీఏ ప్రభుత్వానికే సలహా ఇచ్చిన ఘనత ఆయనది. ఎన్నికల సంస్కరణలు అమలు చేయించేందుకు లోక్ సత్తా చేసిన ఉద్యమంలో జేపీ సాధించిన విజయాలు కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఓ ఎత్తయితే రాజకీయ నేతగా జేపీ ప్రస్ధానం మరో ఎత్తు. కూకట్ పల్లి ఎమ్మెల్యేగా గెలిచినా తనకున్న పరిమితుల్లో జనాన్ని మెప్పించడంలో విఫలమైన జేపీ.. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఏపీ పాలిటిక్స్ లో రీఎంట్రీ
ఉమ్మడి రాష్ట్రం కాస్తా ఏపీ, తెలంగాణగా విడిపోయాక ఎటూ మొగ్గకుండా సైలెంట్ గా ఉండిపోయిన జయప్రకాష్ నారాయణ్ తిరిగి ఇప్పుడు ఏపీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తాజాగా విజయవాడలో ఓ మీటింగ్ పెట్టి పాత లోక్ సత్తా కార్యకర్తలు, నేతల్ని పిలిపించుకుని మాట్లాడిన జేపీ.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో లోక్ సత్తా పోటీ చేయబోతోందని అక్కడి నుంచే ప్రకటించిన జేపీ.. ఇప్పుడు దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ అడుగులు ఎవరికి మేలు చేయబోతున్నాయనే చర్చ మాత్రం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

చంద్రబాబు రుణం తీర్చుకుంటారా ?
ఒకప్పుడు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో లోక్ సత్తా ఎమ్మెల్యేగా జయప్రకాష్ నారాయణ గెలుపు వెనుక ఉన్నది చంద్రబాబేనని చెబుతారు. అప్పట్లో టీడీపీ మద్దతు వల్లే కూకట్ పల్లిలో జేపీ ఎమ్మెల్యేగా గెలిచారన్నవాదన ఉంది. దీంతో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన జేపీ మరోసారి మాత్రం 2014లో గెలవలేకపోయారు. దీనికి తెలంగాణ ఉద్యమంతో పాటు పలు కారణాలు కూడా ఉన్నాయి. అయితే చంద్రబాబు సాయంతో అప్పట్లో కూకట్ పల్లిలో గెలిచిన జేపీ ఇప్పుడు ఏపీలో లోక్ సత్తా అభ్యర్ధుల్ని బరిలోకి దింపడం ద్వారా టీడీపీకి మేలు చేస్తారా లేక ఉమ్మడి విపక్షం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఆశలకు గండికొడతారా అన్నది త్వరలో తేలిపోనుంది.

వైఎస్ జగన్ కే మేలవుతుందా ?
అయితే ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్ని చూస్తుంటే ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు కొనసాగుతోంది. ఈ పోరులో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఎంతగా ఏకమైనా ఓట్ల చీలిక లేకుండా చూసుకోవడం తక్షణావసరం. కానీ విపక్ష కూటమితో కలవకుండా నేరుగా లోక్ సత్తా బరిలోకి దిగితే, జేపీ ప్రచారం చేస్తే అది అంతిమంగా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఉపయోగపడుతుంది. తద్వారా వైఎస్ జగన్ కు మేలు జరిగే అవకాశాలే ఎక్కువ. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో పాలనపై పట్టు కోసం జేపీ సలహాలు, సూచనలు తీసుకున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు జేపీ రీఎంట్రీ వెనుక కూడా జగన్ ఉన్నారనే ప్రచారం విపక్ష కూటమిలో నెలకొంది. దీంతో అంతిమంగా జగన్ కోసమే జేపీ రీఎంట్రీ ఇస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications