జయ బాటలో బాబు: రెండు రాష్ట్రాలకు ఒకే ప్రణాళిక
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడియంకె నేత జయలలిత చూపిన మార్గంలో నడవాలని అనుకుంటున్నారు. అదే సమయంలో రెండు రాష్ట్రాలకు ఒకే ఎన్నికల ప్రణాళికను విడుదల చేయాలని ఆయన అనుకుంటున్నారు.
తమిళనాడులో జయలలిత అమలు చేసిన అమ్మ క్యాంటిన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లో ప్రవేశపెట్టాలని చంద్రబాబు యోచించినట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గసూత్రాలను కూడా ఆయన రూపొందించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లోనూ ఈ క్యాంటిన్లను నెలకొల్పి తక్కువ ధరకు ఆహార పదార్థాలను అందిస్తారు.
రూపాయికే ప్లేట్ ఇడ్లీ, మూడు రూపాయలకు పెరగన్నం, సాంబారు అన్నం, పొంగల్, లెమన్ రైస్, కర్రీ లీవ్స్ రైస్ ఐదు రూపాయలకు ప్లేట్ అందించాలని ఆయన అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తారు.

ఇదిలావుంటే, ఉమ్మడి ప్రణాళిక, కమిటీ ఏర్పాటు విషయంలో తెలంగాణ నాయకుల తీరు అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే తెలంగాణకు ప్రత్యేకంగా కమిటీ వేయాలని తెలంగాణ నాయకులు పట్టుబడుతున్నారు. తెలంగాణకు కమిటీ వేసి తనకు నేతృత్వం అప్పగించాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేస్తున్నారు.
ఆ డిమాండ్‌కు సానుకూలత వ్యక్తం కాకపోవడం వల్లనే ఆయన అసంతృప్తితో పదవికి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అయితే, తెలంగాణకు ప్రత్యేక కమిటీని సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పడనప్పుడు ప్రత్యేక కమిటీ ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications