Chandrababu : నేడు కడపకు చంద్రబాబు- జగన్ పై ఒత్తిడి పెంచే వ్యూహం.. ?
ఏపీలో ఓవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, మరోవైపు వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాలు విపక్ష టీడీపీకి వరంగా మారుతున్నాయి. వీటిని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు ఇప్పటికే మాటల దాడి ప్రారంభించిన టీడీపీ నేతలు.. ఇప్పుడు మరో ఎత్తు వేస్తున్నారు. అదీ వైఎస్ జగన్ సొంత గడ్డ కడపలో ఆయనపై మరింత ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు కడపలో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో వరుసగా నిర్వహిస్తున్న టీడీపీ జోనల్ సమావేశాల్లో భాగంగా ఇవాళ కడపలో మీటింగ్ పెట్టారు. దీనికి రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు హాజరుకాబోతున్నారు. ఈ భేటీ ద్వారా రాయలసీమ జిల్లాల్లో, ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాలో వైసీపీపై ఒత్తిడి పెంచడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన టీడీపీ జోనల్ భేటీలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు కడపలోనూ అదే జోష్ కొనసాగించాలనే ఉద్దేశంలో టీడీపీ అధినేత ఉన్నారు.

కడపలో టీడీపీ జోనల్ భేటీతో సరిపెట్టకుండా సాయంత్రం ముస్లింలతో రంజాన్ ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కడపలో అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా)ను కూడా చంద్రబాబు సందర్శించబోతున్నారు. తద్వారా రంజాన్ మాసంలో ముస్లింలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ నుంచి బయలుదేరి కడప చేరుకోనున్న చంద్రబాబు సాయంత్రం తిరిగి పయనం కానున్నారు.
ప్రస్తుతం వైఎస్ వివేకా కేసులో సీబీఐ అరెస్టులతో వైఎస్సార్ జిల్లాలో పరిస్దితులు హాట్ హాట్ గా ఉన్నాయి. ముఖ్యంగా జగన్ సొంతగడ్డపై వైఎస్ కుటుంబ సభ్యుల్ని సీబీఐ అరెస్టులు చేయడం, విచారణలు చేస్తుండటంతో స్ధానికంగా దీనిపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీన్ని వాడుకుంటూ వైసీపీ, వైఎస్ జగన్ పై ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు ఇవాళ కడపలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు కడప టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications