వైసీపీకి ఛాన్స్: ఒత్తిడిలో బాబు?.. పోలవరంపై ఇదంతా డ్రామా అన్న వైవీ సుబ్బారెడ్డి
Recommended Video

కర్నూలు: ఏపీలో పోలవరం ప్రాజెక్టుపై పెద్ద వివాదమే రేగుతోంది. ప్రాజెక్టు పట్ల కేంద్రం అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తుందన్న తరహాలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం బీజేపీకి మంటపుట్టించింది.
సీఎం వ్యాఖ్యలకు బీజేపీ నుంచి కౌంటర్స్ రావడం.. టీడీపీ నేతలు వాటిని తిప్పికొట్టడంతో వివాదం మరింత పెరిగింది. ఇదిలాగే కొనసాగితే రెండు పార్టీల మధ్య అగాథం టీడీపీకే దెబ్బ కాబట్టి తమ పార్టీ నేతలను సంయమనం పాటించాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు.
ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు వైఖరి చర్చనీయాంశంగా మారింది. పోలవరం విషయంలో బీజేపీని తొలుత ఆయనే టార్గెట్ చేసి ఇప్పుడు పార్టీ నేతలను మాత్రం సంయమనం పాటించాలని కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలవరంపై వివాదం ముదురుతున్న తరుణంలో అటు వైసీపీ నేతలు కూడా కీలక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది.

కమీషన్ల కోసమే:
2019 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని తెలుసుకున్న చంద్రబాబు.. కేంద్రంపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు చేపట్టారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా పోలవరం భూసేకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు డ్రామాలు:
పోలవరంపై మూడున్నరేళ్లలో చంద్రబాబు చేసిందేంటని వైవీ సుబ్బారెడ్డి నిలదీశారు. 2019లో ప్రాజెక్టు పూర్తి కాదని తెలిసే ఇలాంటి డ్రామాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

2018కి పూర్తి చేస్తానన్న బాబు:
2018కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతానని సీఎం చంద్రబాబు పలుమార్లు పలు వేదికలపై చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు కేంద్రం వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉన్నా.. చంద్రబాబే ఏరి కోరి మరీ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారన్న వాదన ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గతంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

భారం పెరిగినందువల్లే:
పోలవరం అంచనా వ్యయం అంతకంతకు పెరుగుతుండటం.. కాంట్రాక్టర్ల పని తీరు సరిగా లేకపోవడంతో సీఎం చంద్రబాబుకు ఇదో పెద్ద తలనొప్పిలా తయారైంది. ఇచ్చిన హామి మేరకు 2018నాటి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి.
దానికి తోడు అటు రాజధాని పనుల్లోను ఎక్కడా పెద్దగా కదలిక లేదు. అలాగే ప్రత్యేక హోదా ఫెయిల్యూర్ వెంటాడుతోంది. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి ఓకె చెప్పినా.. ఆ నిధులు కూడా ఇప్పటిదాకా సరిగా అందింది లేదు. ఇలా ఇన్నేసి భారాలతో చంద్రబాబు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారే కాబట్టే.. పోలవరంపై కేంద్రం మీద నెపం నెడుతున్నారనే వాదన వినిపిస్తోంది.ఈ పరిస్థితిని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయవచ్చు.












Click it and Unblock the Notifications