అభద్రత: జగన్‌కి ఎదురు తిరిగింది, వస్తే ఏంకాదని టిడిపి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయింది! ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీ నుండి గెలుపొందిన పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నారని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం కాంగ్రెసు పార్టీని వీడి బయటకు వచ్చిన జగన్ కొత్త పార్టీ పెట్టి నాడు పలువురు ప్రజాప్రతినిధులను ఆకర్షించారు.
ఇప్పుడు సీమాంధ్రలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అదే పని చేస్తోంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టిడిపిలో చేరారు. కర్నూలు ఎంపి బుట్టా రేణుక కూడా వరుసలో ఉన్నారు. ఆమె దాదాపు చేరినట్లే భావిస్తున్నారు. వీరి దారిలోనే దాదాపు ఇరవై నుండి ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. గతంలో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బలం పెంచుకున్న జగన్‌కు ఇప్పుడు చంద్రబాబు కౌంటర్ ఇస్తున్నారని, జగన్‌కు ఆపరేషన్ వికర్ష్ అయిందని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

ఫిరాయింపుపై యనమల సూచనలు
తమ పార్టీలోకి రావాలని ఆసక్తి చూపుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారికి టిడిపి నేత యనమల రామకృష్ణుడు సూచనలు కూడా చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేవలం రిజిస్టర్డ్ పార్టీయేనని, రికగ్నైజ్డ్ పార్టీ కాదని, అందువల్ల ఆ పార్టీని వీడినా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదని లాజిక్ చెబుతున్నారు. జగన్ పార్టీకి విప్ జారీ చేసే హక్కు ఏమాత్రం లేదంటున్నారు.
ధీటుగా జగన్ పార్టీ, గందరగోళపర్చేందుకే
దానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధీటుగా స్పందిస్తోంది. పార్టీని వీడితే వారికి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని చెబుతున్నారు. మైసూరా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ విప్ కచ్చితంగా ఉంటుందని చెప్పారు. తమ పార్టీని గందరగోళ పర్చడానికే టిడిపి తమ ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తోందని జగన్ పార్టీ ఆరోపిస్తోంది.
అవినీతిపరులపై మోడీ కొరడా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడాలనే యోచన వెనుక పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్న విషయం తెలిసిందే. సీమాంధ్రలో టిడిపి, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నందున జగన్ ఆ కేసుల నుండి తప్పించుకునే అవకాశం లేదంటున్నారు. నరేంద్ర మోడీ అవినీతిపరులను తన కేబినెట్లోకి తీసుకునేందుకు నిరాకరిస్తున్నారట.
ఈ నేపథ్యంలో రానున్న కాలంలో అవినీతిపరుల పైన కొరడా ఝులిపించే అవకాశాలు లేకపోలేదని, అప్పుడు జగన్ చిక్కుల్లో పడక తప్పదంటున్నారు. మోడీని జగన్ కలిసినప్పుడు కూడా ఆయనకు ఎలాంటి హామీ రాలేదని ప్రచారం జరిగింది. అంతేకాదు జగన్ అంశాలవారీగా మద్దతిస్తానని ప్రకటిస్తే... బిజెపి ధీటుగా స్పందించింది. ఎపిలో తమకు టిడిపితో పొత్తు ఉందని, ఎవరి మద్దతు అవసరం లేదని సూటిగా చెప్పారు.
అభివృద్ధి, అభద్రత
జగన్ కేసులు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. జగన్ జైలుకెళ్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే అభధ్రతా భావం పలువురిలో కనిపిస్తోందని అంటున్నారు.
అంతేకాకుండా కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపికి సంపూర్ణ మెజార్టీ వచ్చినందున రానున్న ఐదేళ్లలో మధ్యంతర ఎన్నికలకు అవకాశం లేదు. దీంతో తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా అధికార పార్టీ వైపు వెళితేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట. సీమాంధ్రలో టిడిపి తప్ప మరో పార్టీ లేనందునే ఆ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ వైపు చూస్తున్నారని, త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖాళీ కావడం ఖాయమని టిడిపి నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications