మచ్చలేనోళ్లకే: విజయమ్మ, 17న విశాఖలో నామినేషన్
హైదరాబాద్/గుంటూరు: మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచి పరిపాలన వస్తుందని, దీనికోసం మీ ఓటును మచ్చలేని నాయకులకు వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ శనివారం అన్నారు. ఆమె గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు రాజకీయంగా ఎన్టీఆర్‌ను చంపి.. ఇప్పుడు ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించడం విడ్డూరమన్నారు.
ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో మాట్లాడారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు రద్దు, జనసేవా కేంద్రాలు, పింఛన్ల పెంపు, అమ్మ ఒడి, రైతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు వంటి దస్త్రాల పైన సంతకాలు చేస్తారన్నారు. నియోజకవర్గానికి ఒక్కచోటే మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తాడన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ట్విస్ట్! ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను విశాఖ లోకసభ బరిలో దించనున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విజయమ్మను బరిలో దింపాలని ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారట. ఈ నెల 17న విజయమ్మ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
విశాఖ బరిలో షర్మిలను దింపే అవకాశాలున్నట్లుగా చాలా రోజులుగా ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు అనూహ్యంగా విజయమ్మ పేరు తెర పైకి వచ్చింది. 17న నామినేషన్ దాఖలు చేసేందుకు విజయమ్మ సన్నాహాలు చేసుకుంటున్నారట.












Click it and Unblock the Notifications