జూలైలో 7 వేల పెన్షన్- చంద్రబాబు సంచలన హమీ..!
ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ నిలిపివేత రచ్చ నడుస్తున్న వేళ వైసీపీకి పోటీగా పెన్షన్ మొత్తం పెంపుపై విపక్ష టీడీపీ ఇస్తున్న హామీలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెలకు 3 వేల చొప్పున పెన్షన్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో పెన్షన్లను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్ధితి నెలకొంది. అయితే విజయంపై ధీమాగా ఉన్న రాజకీయ పార్టీలు పెన్షన్ పెంపుపై ఆచితూచి స్పందిస్తున్నాయి.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య తాము అధికారంలోకి వస్తే నెలకు 4 వేలకు పెన్షన్ మొత్తం పెంచుతామని హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లోనూ 2 వేలుగా ఉన్న పెన్షన్ ను 3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చినా జనం నమ్మలేదు. దీనికి కారణం జగన్ కూడా 3 వేలు ఇస్తామన్న హామీ ఇవ్వడమే. అయితే గెలిచాక జగన్ తాను 3 వేలకు పెంచుకుంటూ పోతానని మాత్రమే హామీ ఇచ్చానని తేల్చేశారు. దీని ప్రకారం ఏటా 250 చొప్పున పెరగాల్సి ఉండగా.. మధ్యలో ఓ ఏడాది మినహాయించి ఐదేళ్ల పాలన పూర్తయ్యే సరికి 3 వేలకు పెంచారు.

ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే 4 వేలు ఇస్తామన్న హామీని ఇస్తున్న చంద్రబాబు ఐవీఆర్ఎస్ రూపంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా తాము అధికారంలోకి రాగానే అంటే జూన్ లేదా జూలైలో పెరిగిన వెయ్యి రూపాయల పెన్షన్ ను ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి మూడు వేలు, జూలైలో ఇవ్వాల్సిన 4 వేలకు కలిపి మొత్తం 7 వేలు ఇస్తామని ప్రచారంలో చెబుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications