కెసిఆర్‌ను సంప్రదిస్తే వివాదం ఉండేది కాదు: చంద్రబాబుకు లక్ష్మీపార్వతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరును చంద్రబాబు అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని వాపోయారు.
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని దేశీయ టెర్మినల్‌కు పేరు పెట్టే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును సంప్రదించివుంటే వివాదం వచ్చేది కాదన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబునాయుడు అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించేందుకు తెలుగుదేశం ప్రయత్నం చేయాలని అన్నారు.

ఇది ఇలా ఉండగా ఇటీవల లక్ష్మీపార్వతి తెలంగాణ సిఎంకు ఓ లేఖ కూడా రాశారు. ఎన్టీఆర్ మృతిపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆ లేఖలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కోరారు. కుట్ర, మోసాలతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారకులయ్యారని, నెపం తనపై నెట్టి తనను దోషిగా చూపించే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు.
ఎన్టీఆర్ మరణం వెనక వాస్తవాలు ప్రపంచానికి తెలియాలని ఆమె అన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కెసిఆర్ తన అభ్యర్థనను మన్నించాలని ఆమె కోరారు. చంద్రబాబు నాయుడు ఓ వర్గం మీడియాను అడ్డు పెట్టుకుని వాస్తవాలను కప్పిపుచ్చారని ఆమె విమర్శించారు. శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరే కొనసాగించాలనిు ఆమె లక్ష్మీపార్వతి తన లేఖ ద్వారా కెసిఆర్‌ను కోరారు.












Click it and Unblock the Notifications