
టీడీపీ ఓటమిపై చంద్రబాబు స్పందన -సిగ్గుంటూ మళ్లీ కృష్ణాజిల్లాకు రావొద్దన్న మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం వెలువడిన ఫలితాల్లో అధికార వైసీపీ ఘనవిజయం సాధించింది. పార్టీ గుర్తుపై జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ ఘోరపరాజయం పాలైంది. మొత్తం 12 కార్పొరేషన్లకుగానూ 11 కార్పొరేషన్లు వైసీపీ గెలుచుకోగా, హైకోర్టు తీర్పు కారణంగా ఏలూరు కార్పొరేషన్ ఫలితం నిలిచిపోయింది. ఇక రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలకుగానూ వైసీపీ 74 చోట్ల గెలుపొందింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అదే సమయంలో మంత్రి కొడాలి నాని సైతం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వివరాలివి..

తమ్ముళ్లకు చంద్రన్న భరోసా..
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై చంద్రబాబు స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని ఆయన కొనియాడారు. కొన్ని చోట్ల ప్రాణాలు పణంగా పెట్టి మరీ పార్టీకి అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుత ఫలితాలు చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని శ్రేణులకు భరోసా ఇచ్చారు. వైసీపీ అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడామని, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగాలని పార్టీ శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తే రాబోయే రోజుల్లో టీడీపీని విజయం వరిస్తుంది చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే..

జనానికి ఏం కావాలో జగన్‌కు తెలుసు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నవారే నాయకులంటూ, టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసు అని చెప్పారు.

బాబుకు సిగ్గుంటే మళ్లీ రావొద్దు..
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కొడాలి నాని హితవు పలికారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికలైన తర్వాత చంద్రబాబుది మరో మాట ఉంటుందని మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగు పెట్టకూడదని అన్నారు. అమరావతిలో ఉన్న రైతులను చంద్రబాబు రోడ్డుపైకి తెచ్చారని కొడాలి నాని మండిపడ్డారు. మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు చూశారని కొడాలి నాని మండిపడ్డారు. ఇప్పటికైనా దొంగల్ని వదిలేసి అమరావతి ప్రజలు ఆలోచించాలన్నారు. పవన్‌కళ్యాణ్, బీజేపీ, ఎల్లో మీడియా కలిసి ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మలేదని మంత్రి నాని అన్నారు.
జగన్ దెబ్బకు ఓవైసీకి భారీ లాస్ -హిందూపూర్‌లో బోణీతో సరి -చంద్రబాబుకు ఎంఐఎం రిటర్న్ గిఫ్ట్!