ఎన్టీఆర్ పాలన గుర్తుచేసి.. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం: చంద్రబాబు పిలుపు!!
నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా నందమూరి తారక రామారావు గారి పాలనను గుర్తు చేశారు. తెలుగు ప్రజలరా రండి. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం అంటూ పిలుపునిచ్చిన చంద్రబాబు, రామన్న రాజ్యాన్ని సాధించటమే నందమూరి రామారావు కు అసలైన నివాళి అని పేర్కొన్నారు.
త్వరలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఏపీలో ప్రభుత్వ పాలన వివరించి, తిరిగి రామరాజ్యాన్ని సాధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అణగారిన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతున్నదని ప్రస్తుత జగన్ సర్కార్ పాలనపై మండిపడ్డారు.

ఈ వేళ తిరిగి రామరాజ్య స్థాపనకు రామారావు స్ఫూర్తిగా మనందరం కదలాలి అని అందుకే 'తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని ఆనాడు రామారావు ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా, రా కదలిరా అంటూ తాను కూడా ప్రస్తుతం పిలుపునిచ్చాను అనిచంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలంతా సంఘటితంగా ముందుకు కదలి రావాలన్నారు.
ఇదే సమయంలో నందమూరి తారక రామారావు సాధించిన అద్భుతమైన విజయాలను కొనియాడారు. ఒక జీవితం రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది ఆయన అంటూ కితాబిచ్చారు చంద్రబాబు.
తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు అని పేర్కొన్న చంద్రబాబు పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న రామారావు కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. నందమూరి తారక రామారావు స్పూర్తిగా అందరూ టీడీపీకి అండగా ఉండాలని ఆయన కోరుతున్నారు.












Click it and Unblock the Notifications