అమరావతిపై చంద్రబాబు కీలక అడుగు- గెజిట్ నోటిఫికేషన్ జారీ..!
ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్.. అమరావతిపై వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసే సమయానికే అమరావతిలో ముళ్లకంపలు తొలగించి, రోడ్లపై లైటింగ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఇప్పటికే ప్రారంభించి ఆగిపోయిన భవనాల తాజా పరిస్ధితిని తెలుసుకుంది. ఇప్పుడు ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం మరో కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం కోసం భూమిని గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1,575 ఎకరాల ప్రాంతాన్ని భవనాల నిర్మాణం కోసం సీఆర్డీఏ నోటిఫై చేసింది.మాస్టర్ ప్లాన్‍లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు సీఆర్డీఏ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు సీఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం అధికారులు బహిరంగ ప్రకటన జారీ చేశారు.

అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం గుర్తించారు. లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం దీన్ని నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ అయింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలో ఈ ప్రాంతంలో భవనాల నిర్మాణం ప్రారంభం కాబోతోంది.












Click it and Unblock the Notifications