ఏపీలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..! 5 లక్షల వరకూ..
ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకూ మహిళలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహించిన ప్రభుత్వం.. ఇకపై వారికి వ్యక్తిగతంగానూ లబ్ది చేకూర్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా సెర్ప్ ద్వారా ఆర్ధిక సాయం చేయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల కాబోతున్నాయి.

రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులకు ఇప్పటికే బ్యాంకుల ద్వారా గ్రూప్ లోన్స్ అందిస్తున్నారు. వీటితో పాటు ఇకపై డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు లక్ష నుంచి 5 లక్షల వరకూ అదే బ్యాంకుల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో వ్యక్తిగత రుణాలు కూడా అందించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. డ్వాక్రా గ్రూపులో ఒకేసారి గరిష్టంగా ముగ్గురికి లక్ష నుంచి 5 లక్షల వరకూ ఈ పర్సనల్ లోన్ బ్యాంకుల ద్వారా ఇప్పించనున్నారు. తద్వారా వారి ఆర్ధిక పరిస్ధితి మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో 2 వేల కోట్ల వరకూ ఇలా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలకు పర్సనల్ లోన్లు ఇప్పించాలని సెర్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే యూనిట్లు నడుపుతున్న వారితో పాటు కొత్తగా యూనిట్లు ప్రారంభించాలనుకునే వారికీ ఈ లోన్లు ఇప్పిస్తారు. ఇలా మొత్తం లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు ఈ ఆర్ధిక సంవత్సరంలో లోన్లు ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో లక్షా 35 వేల మందికి లక్ష రూపాయల చొప్పున, మిగిలిన 15 వేల మందికి 5 లక్షల చొప్పున లోన్లు ఇప్పిస్తారు. భవిష్యత్తులో ఈ లోన్ ను రూ.10 లక్షలకు పెంచే అవకాశమున్నట్లు సెర్ఫ్ అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications