స్పష్టత ఇవ్వలేను: విభజనపై అశోక్‌తో చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం సమన్యాయం చేయలేకపోతున్నందున స్పష్టతం ఇవ్వాలని తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కోరానని, తనంత తానుగా స్పష్టత ఇవ్వలేని చంద్రబాబు చెప్పారని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించాలని కోరడానికి ఆయన శనివారం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తే పార్టీ కార్యకర్తలతో మాట్లాడి స్పష్టత ఇస్తానని చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశానికి రావాలని తాము కోరితే పార్టీ ప్రతినిధులను పంపుతామని చంద్రబాబు చెప్పారని అశోక్ బాబు అన్నారు. ఒకటిరెండు రోజుల్లో మిగతా పార్టీల నాయకులను కలుస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో జాతీయ పార్టీల నాయకులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరుతామని ఆయన చెప్పారు.

అసెంబ్లీలో మెజారిటీ శాసనసభ్యులు బిల్లును వ్యతిరేకిస్తే రాష్ట్ర విభజన ఆగిపోవచ్చునని అశోక్ బాబు అన్నారు. ఆయన శనివారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకించాలని బొత్సను కోరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తే అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు ఉందని ఆయన అన్నారు.
రాయల తెలంగాణ ఎందుకు అడుగుతున్నారో తెలియదని మంత్రి శైలజానాథ్ తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను ఎప్పటికే సమైక్యవాదినే అని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications