కెసిఆర్ దీక్షతో అర్ధరాత్రి తెలంగాణ, చిరంజీవి వల్లే ఓడాం: దులిపిన బాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం రాష్ట్ర విభజన - రాజకీయ పార్టీల తీరుపై విధాన పత్రం విడుదల చేశారు. ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ దీక్ష చేస్తే చిదంబరం అర్ధరాత్రి తెలంగాణపై ప్రకటన చేశారన్నారు.
ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను కలిపి.. కాంగ్రెసేతర పక్షాలను ఏకతాటి పైకి తీసుకు వచ్చి ఆ పార్టీకి సవాల్ విసిరారన్నారు. కాంగ్రెసేతర పక్షాలు కేంద్రంలో అధికారం చేపట్టడంలో టిడిపి పాత్ర ఉందన్నారు.
తాము కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ రాజీపడలేదని, ఎప్పుడు పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పార్ట లేని రోజుల్లో టిడిపి వచ్చిందన్నారు. 34 ఏళ్లుగా టిడిపి చేసిన కృషి ఎనలేనిదన్నారు. 1999లో తాము అధికారంలోకి రాలేమని భావించిన కాంగ్రెస్ తెలంగాణను తెరపైకి తెచ్చిందన్నారు.
టిడిపిని చూస్తేనే కాంగ్రెస్ పార్టీ వణికిపోతోందన్నారు. తాము కాంగ్రెస్ పార్టీ పైన మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. టిడిపి ఆవిర్భావంతోనే కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు. 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు బయటపడ్డాయని, ఎన్నో కుంభకోణాలు వెలుగు చూశాయన్నారు.

2జి స్పెక్ట్రం, కామన్వెల్త్, గాలి జనార్ధన్ రెడ్డి.. ఇలా ఎన్నో కుంభకోణాలు బయటపడ్డాయన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ మెజార్టీతో గెలిచిందన్నారు. 1972 - 73లలో ప్రత్యేక ఆంధ్రా కోసం పోరాటం వచ్చిందని చెప్పారు.
మా పైన ఒత్తిడి వచ్చింది
2004లో తాము సమైక్య రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నామని చంద్రబాబు చెప్పారు. అయితే, 2009లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా పెరిగిందని, తాము టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ దృష్ట్యా తమ పైన ఒత్తిడి పెరిగిందన్నారు.
1968 - 69 మధ్యనే తొలిసారి తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పారు. 2004లో సమైక్యంగా ఉంటామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. ఆ తర్వాత 2009లో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గుర్తించి తాము టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు.
2009లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రకు తెరలేపిందన్నారు. డిసెంబర్ 9, 2009న తెలంగాణను ప్రకటించిందని, ఆ తర్వాత డిసెంబర్ 23, 2009 దానిని వెనక్కి తీసుకుందని చెప్పారు. 2001లో కెసిఆర్ టిఆర్ఎస్ పెట్టారని, 2009లో దీక్ష చేశారని చెప్పారు. 2009 ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తే టిఆర్ఎస్ ఆశించిన స్థాయిలో గెలుపొందలేదన్నారు.
ప్రజారాజ్యం విలీనం
2009లో టిడిపి ఓటమికి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం కారణమైందన్నారు. ఆ తర్వాత అదే పిఆర్పీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుందని చెప్పారు.
అఖిల పక్షానికి నేను వెళ్లలేదు.. కెసిఆర్ అమరణ దీక్షతో అర్ధరాత్రి ప్రకటన
భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా 1956లో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని చెప్పారు. కెసిఆర్ దీక్షతో చిదంబరం అర్ధరాత్రి తెలంగాణపై ప్రకటన చేశారన్నారు.
ఆ తర్వాత 6-1-2011లో అఖిల పక్షాన్ని పిలిస్తే తాను వెళ్లలేదని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారని, అది నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు. రాజకీయ ప్రయోజనాలతో కాంగ్రెస్ పబ్బం గడుపుకుంటోందన్నారు. 13 జిల్లాల్లో సమైక్యాంధ్ర కోసం ప్రజా గర్జన చేశారన్నారు.
ఇద్దరికీ ఆమోదయోగ్యం కావాలన్నా
ఇటు తెలంగాణ సెంటిమెంట్, అటు సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కావాలని తాను కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు కోరానని చెప్పారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని మొరపెట్టుకున్నానని చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని మండిపడ్డారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందన్నారు.












Click it and Unblock the Notifications