పదేళ్ల ఏపీ ఆర్ధిక స్థితి ఇదే-చంద్రబాబు శ్వేతపత్రం-మధ్యలో జగన్ తో నష్టమిదే..!
ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వివిధ రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ అసెంబ్లీలో గత పదేళ్ల ఆర్ధిక పరిస్ధితిపై సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక పరిస్ధితి ఎలా తయారైంది, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అప్పట్లో దాన్ని గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు, ఆ తర్వాత వైసీపీ పాలనలో తీసుకున్న నిర్ణయాల వల్ల తిరిగి ఎలాంటి నష్టం జరిగిందన్న దానిపై సీఎం వివరాలు వెల్లడించారు.
విభజన తర్వాత రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, తయారీ రంగం తెలంగాణకు పరిమితం కావడం, ఏపీలో వ్యవసాయ రంగం మాత్రమే బలంగా ఉండటం వంటి కారణాల వల్ల ఆర్ధికంగా పుంజుకోవడం కష్టంగా మారిందన్నారు. అయినా 2014-19 మధ్య రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు తాము చాలా ప్రయత్నాలు చేసినట్లు చంద్రబాబు చెప్పుకున్నారు. 16 లక్షల కోట్ల మేర తాము ఎంవోయూలు చేసుకుంటే 5 లక్షల కోట్ల మేర పరిశ్రమలు వచ్చాయన్నారు.

విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, అభివృద్ధి చేస్తే రాష్ట్రం తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుందని చంద్రబాబు వెల్లడించారు. గతంలో తాము మొదలుపెట్టిన అభివృద్ధిని జగన్ సర్కార్ మధ్యలో అడ్డుకుందని, మధ్యలో వైసీపీ ప్రభుత్వం రాకుండా ఉంటే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. అలాగే అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగి ఉంటే 3 లక్షల కోట్ల ఆస్తి ఉండేదన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి 9.74 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు.
మరోవైపు ఇన్ని సమస్యలు ఉన్నా సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి తీరుతామని చంద్రబాబు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు మనం కూడా కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేసుకుండా పనిచేద్దామని సూచించారు.












Click it and Unblock the Notifications