బాబు ఇంటికి వాస్తు మరమ్మత్తులు: టిడిపి జిల్లా ఆఫీసే రాష్ట్ర ఆఫీస్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తాత్కాలిక నివాసగృహానికి మరమ్మతులు చేపట్టారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పరిధిలో గల కృష్ణానది కరకట్టపై నిర్మించిన లింగమనేని ఎస్టేట్స్ గెస్ట్‌హౌస్‌ను సిఎం వాస్తుసిద్ధాంతి రాఘవయ్య నిశితింగా పరిశీలించారు. ఆ తర్వాత మార్పులుచేర్పులకు సంబంధించి పలు సూచనలు చేశారు.
సిద్ధాంతి సూచనల ప్రకారం ఈశాన్యం వైపున ద్వారం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాన్వాయ్ రాకపోకలకు అనువుగా ఉండే విధంగా రెండు మార్గాలను చేయనున్నారు. కరకట్టపై గల ప్రస్తుత రహదారిని పూర్తిస్థాయిలో విస్తరించాలని ఆర్‌అండ్ బి అధికారులకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాలు జారీచేశారు.
వాటికితోడు, ఉండవల్లి గ్రామంలోకి వెళ్లే మరోమార్గాన్ని కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. సిఎం తాత్కాలిక గృహం వద్ద సబ్‌స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన వెయ్యి గజాల స్థలం సేకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఇ జయభారత్‌రావు ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు పనులు ప్రారంభించారు.

జిల్లా పరషత్ సిపిఒ సుబ్బారావు కూడా అధికారులతో పాటు గృహాన్ని పరిశీలించారు. మంచినీటి సదుపాయాలకు సంబంధించి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. ముఖ్యంగా సిఎం తాత్కాలిక నివాసగృహానికి ఎదురుగా గల పొలాలు ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చారా, లేదా అనే అంశంపై అధికారుల మధ్య చర్చలు జరిగాయి.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాన్నే ఏపీ టీడీపీ కార్యాలయంగా మార్చనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఇరురాష్ర్టాలకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతూ వస్తున్నాయి.
కొద్దిరోజులుగా ఇరురాష్ర్టాల మధ్య వివాదాలు తలెత్తడం, అలాగే ఏపీలోని 13 జిల్లాలకు చెందిన టీడీపీ కార్యకర్తల వారి పనులపై హైదరాబాద్‌కు రావడంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఈ స్థితిలో ఏపీలో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా పార్టీ వాస్తు సిద్ధాంతి రాఘవతో పాటు లోకేష్, చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది గుంటూరు కార్యాలయాన్ని పరిశీలించి వెళ్లారు. ఈ నెలాఖరులోగా జిల్లా ఆఫీసులో పార్టీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications