అలా పడిపోయా.. ముంచేశారు....గతాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు..!
ఏపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేతల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్ధానం ఆయనది. అయినా పలుమార్లు రాజకీయాల్లో ఎదురుదెబ్బలు కూడా తిన్న చరిత్ర ఆయనకు ఉంది. అయితే అప్పట్లో తగిలిన ఆ దెబ్బలకు గల కారణాల్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలో జాతీయ దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు తనకు గతంలో తగిలిన ఎదురుదెబ్బలపై ఎన్నో విషయాలు బయటపెట్టారు.
90వ దశకం ప్రారంభంలో మొదలైన ఆర్ధిక సంస్కరణలు, ఇంటర్నెట్ ను వాడుకుంటూ ప్రజల జీవితాల్ని మెరుగుపర్చేందుకు 1995లో అధికారంలోకి వచ్చాక తాను తీవ్రంగా ప్రయత్నించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సంస్కరణలు తెచ్చి వాటిని జనానికి వివరించడంలో సక్సెస్ కావడం వల్లే 1999లో తిరిగి గెలిచానని చంద్రబాబు తెలిపారు. అయితే పొగడ్తలకు పడిపోయి ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే 2004, 2019లో ఓటములు ఎదుర్కొన్నట్లు సీఎం గుర్తుచేసుకున్నారు.

అందరూ తనను పొగుడుతుంటే అంతా బాగానే చేస్తున్నట్లు భావించినట్లు చంద్రబాబు అప్పటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. దీంతో ప్రజల్ని వదిలేసి ముందుకెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు. ఇదే తనను అధికారం వచ్చాక రెండు ఎన్నికల్లో ముంచేసిందన్నారు. అయితే ప్రధాని మోడీ అప్పట్లో తనలా కాకుండా ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఇప్పుడు మాత్రం తాను ఆ అనుభవాలతో ప్రజలను అభివృద్ధి, సంక్షేమంతో పాటు ముందుకు తీసుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల కోసం మోడీ ఇప్పటికే ప్రణాళికలు మొదలుపెట్టారని, ఆయనతో కలిసి ముందుకెళ్తామన్నారు.












Click it and Unblock the Notifications