వైజాగ్ కు గూగుల్ అందుకే వచ్చింది..! అసలు కారణం చెప్పిన సీఎం..!
ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వానికి గత వారం గూగుల్ బిగ్ న్యూస్ చెప్పింది. 15 బిలియన్ డాలర్ల వ్యయంతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రానికి ఇది అత్యంత వ్యూహాత్మక పెట్టుబడిగా మారింది. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వాతావరణం లేదని ఇప్పటివరకూ భావిస్తున్న వారిని ఇది పునరాలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో విశాఖకు గూగుల్ రాక వెనుక అసలు కారణాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన పోలీసు అమరవీరుల దినం సందర్భంగా ఏర్పాటు చేసిన పరేడ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల రాకకు శాంతిభద్రతలు చాలా అవసరమని, ఇదే కారణంతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని చంద్రబాబు వెల్లడించారు. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావని పోలీసులకు గుర్తుచేశారు.

అందుకే తాను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటానని చంద్రబాబు గుర్తుచేశారు. పెట్టుబడులు పెట్టే వారు తమ పెట్టుబడులకు రక్షణ కోరుకుంటారని, పెట్టుబడులు పెడితే ఇబ్బంది ఉండదన్న నమ్మకం ఉంది కాబట్టే గూగుల్ సంస్థ వచ్చిందని తెలిపారు. 15 బిలియన్ డాలర్ల అతిపెద్ద పెట్టుబడి వచ్చిందని, ఏఐ డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని తెలిపారు.
ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్,, ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో ఎంతో పేరు తెచ్చుకున్నారని సీఎం వారిని ప్రశంసించారు.

ఈ సంవత్సరం విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని, వారికి నివాళులు అర్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందన్నారు. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదని, నిస్వార్థ సేవ అని చంద్రబాబు తెలిపారు. విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు, సంతోషాలను త్యాగం చేస్తున్న మీ కుటుంబాలకు నమస్కారాలు చెపుతున్నా అన్నారు. నేరాల తీరు మారుతోందని, క్రిమినల్స్ అప్ డేట్ అవుతున్నారని, వారి ఆటకట్టించాలంటే మీరు మరింత అప్ డేటెడ్ వెర్షన్ తో ఉండాలని పోలీసుల్ని కోరారు. అందుకే సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications