తొలగని ప్రతిష్టంభన: చంద్రబాబు అలా, ముద్రగడ ఇలా, బలవంతపు వైద్యం తప్పదా?
తూర్పుగోదావరి: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహారదీక్షపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. దీక్ష విరమింపజేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఆరో రోజైన మంగళవారం కూడా ఫలించలేదు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి బాగా దెబ్బతింటుండటంతో దీక్ష విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ క్రమంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పలు దఫాలు సమావేశమై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వీరంతా మంగళవారం ఉదయం నుంచి రాత్రి బాగా పొద్దుపోయేంత వరకు విజయవాడలోని సీఎం కార్యాలయంలోనే గడిపారు.
మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో ముఖ్యమంత్రితో కాపు నాయకుల సమావేశం జరిగింది. ముద్రగడతో, కాపు ఐక్యకార్యాచరణ సమితి నాయకులతో చర్చలకు ప్రభుత్వ ప్రతినిధిగా తూర్పు గోదావరి కలెక్టర్‌ను అరుణ్ కుమార్‌ను పంపించాలని నిర్ణయించారు. దాని ప్రకారం కలెక్టర్, డీఐజీ, ఎస్పీలు వెళ్లి ముద్రగడతో చర్చలు జరిపారు. తుని విధ్వంసం సంఘటనలో పెట్టిన కేసుల్ని పూర్తిగా ఎత్తివేయడం సాధ్యం కాదని వారు మళ్లీ స్పష్టం చేశారు.
సీఐడీ దర్యాప్తుతో ముద్రగడ సంతృప్తి చెందకపోతే మళ్లీ దర్యాప్తు చేయించేందుకు సిద్ధమని చెప్పారు. సీఐడీ కేసులు పెట్టి అరెస్టు చేసిన వారికి బెయిల్ ఇప్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీక్ష విరమించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కాపు నాయకులంతా రాజమండ్రిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గడిపారు.
కేసులు ఎత్తివేసేది లేదు, దీక్ష విరమిస్తేనే..: చంద్రబాబు
తుని ఘటనలో కేసులు ఎత్తివేసేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, దీక్ష విరమిస్తే ఆయా కేసుల్లో పునర్విచారణ జరిపేందుకు మాత్రం సిద్ధమేనని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి సంకేతాలు పంపారు.
ముద్రగడ దీక్ష ఆరో రోజుకు చేరడం... కాపుల ఆందోళన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. రాజమహేంద్రవరం ఆస్పత్రిలో దీక్షలో ఉన్న ముద్రగడ వద్దకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ను పంపాలని నిర్ణయించారు. కేసులు ఎత్తివేయాల్సిందేనని ముద్రగడ పట్టుబట్టడం... అది కుదరదని ప్రభుత్వం స్పష్టం చేస్తుండటంతో పీటముడి వీడటంలేదు.
ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా ఆయా కేసుల్లో పునర్విచారణ ప్రతిపాదన ముందుకొచ్చింది. ముద్రగడ దీక్షను విరమిస్తే పునర్విచారణకు సిద్ధమనే సంకేతాలను కలెక్టర్ ద్వారా పంపాలని నిర్ణయించారు. మరోవైపు ఆరు రోజులుగా దీక్షలో ఉండటంతో ముద్రగడ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని వైద్యులు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించి దీక్ష విరమించని పక్షంలో ఏక్షణమైనా, బలవంతంగానైనా ముద్రగడకు చికిత్స ప్రారంభించి, ఫ్లూయిడ్స్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కేసులు ఎత్తివేస్తేనే దీక్ష విరమణ: ముద్రగడ
కాపు నేతలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తేనే నా కోరిక తీరుతుందని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తాను మనస్తాపంతో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేగాక, తనకు వైద్య పరీక్షలు అవసరం లేదని చెప్పి.. వైద్యాన్ని నిరాకరించారు. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్ కిశోర్, వైద్యులు సీఎ్‌సశర్మ, నాయక్, సౌభాగ్యలక్ష్మి మంగళవారం మీడియాకు వెల్లడించారు.
అయితే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌తోపాటు ముద్రగడ కుమారులు బాలు, గిరి, తాము నచ్చచెప్పడంతో ఆయన బీపీ చూపించుకున్నారని, బీపీ నార్మల్‌గా (140/90) ఉందన్నారు. కానీ బాగా నీరసించారని, రోజూలా నిలబడకుండా పడుకునే మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయన సతీమణి పద్మావతి, కోడలు సిరిలకు ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ఇ
ముద్రగడకు బలవంతంగానైనా వైద్యం చేయాలని, అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. కాగా, ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తూ, వైద్యానికి నిరాకరిస్తూ ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని వైద్యులు చేసిన సూచన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ధ్రువీకరించారు. 309 ఆర్/డబ్ల్యు 34 ఐపీసీ సెక్షన్ ప్రకారం ఈ కేసు నమోదు చేశామన్నారు.
అరెస్టైన వారికి వైద్యం
ఇటీవల సీఐడీ అరెస్టు చేసిన కాపు ఉద్యమ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, గణేశుల రాంబాబు, వాసిరెడ్డి ఏసుదాసులను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వైద్యం కోసం ఆస్పత్రికి తరలించి.. ముద్రగడ వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది.
వైద్యానికి సహకరించాలని వారు కూడా ఆయన్ను కోరినట్లు సమాచారం. వీరి సమక్షంలోనే అధికారులు అరెస్టయిన నిందితులకు బెయిల్ ఇప్పించే విషయం ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ చర్చల్లో కాపు సంఘ నాయకులు రామినీడి మురళీ, చిన్నమిల్లి వెంకట్రాయుడు, అడపా నాగేంద్ర, ఆరేటి ప్రకాష్ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications