మాటల యుద్ధం .. చంద్రబాబు మానసిక స్థితి బాగా దిగజారింది .. ప్యాకేజ్ కోసమే జనసేన
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అటు టీడీపీ అధినేత చంద్రబాబును, ఇటు జనసేన పార్టీని సోషల్ మీడియా వేదికగా తూర్పారబడుతున్నారు. కరోనాపై జగన్ సర్కార్ బ్రహ్మాస్త్రం వేసిందని అది ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఇక జనసేనను ప్యాకేజ్ కోసం పుట్టిన పార్టీ అన్న విజయసాయి , చంద్రబాబు మానసిక పరిస్థితి దారుణంగా మారిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు .

కరోనా పై ఏపీ ప్రభుత్వం బ్రహ్మాస్త్రం
ఏపీలో అందరికీ మాస్కుల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి . ఇక ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎంపీ విజయసాయి రెడ్డి రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. ఇక 16 కోట్ల మాస్కుల పంపిణీ చేపట్టామని చెప్పిన ఆయన ప్రపంచంలో ఎక్కడా జరగలేదని , ఆ ఘనత ఏపీకే దక్కుతుందని తెలిపారు. కరోనాపై బ్రహ్మాస్త్రం ఇది అని ఆయన పేర్కొన్నారు .

టీడీపీపై విరుచుకుపడిన విజయసాయి
అతితక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటుంది. ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలో ఆ విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు . కరోనా నివారణ కోసం ఏ రాష్ట్రం అమలు చేయని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి . ఇక ఇదే సమయంలో టీడీపీ పై విరుచుకు పడ్డారు. ఎల్లో మీడియాకు, పచ్చ మేధావులకు ఇవేమీ కనిపించవు. నిమ్మగడ్డ పదవీకాలం ముఖ్యమైపోయింది వీళ్లకు. సిగ్గులేని బతుకులు అంటూ నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి .

చంద్రబాబు మానసిక స్థితి కరోనా తీవ్రత తగ్గేలోగా సీరియస్ అవుతుందని ఎద్దేవా
చంద్రబాబుకు ఏపీలో జగన్ పనితీరుతో ఏం చెయ్యాలో అర్ధంకాక మానసిక పరిస్థితి బాగా దిగజారిందని సెటైర్లు వేశారు. "సెంట్రల్ కేబినెట్ సెక్రటరీకి ఫోన్ కలుపు, ఏపీ సిఎస్ ను మాట్లాడమను, హెల్త్ సెక్రటరీ రిపోర్టేదీ? తక్షణం మీడియా కాన్ఫరెన్సు అరేంజ్ చేయండి. చంద్రబాబు పలవరింతలివన్నీ. ఆయన మానసిక పరిస్థితి బాగా దిగజారిందంటున్నారు. కరోనా తీవ్రత తగ్గేలోగా సీరియస్ అవుతుందని టెన్షన్ పడుతున్నారట!" అంటూ ఆయన చంద్రబాబును ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్యాకేజ్ కోసం పుట్టిన పార్టీ అని జనసేనపై తీవ్ర విమర్శలు
ఇక ఇదే సమయంలో జనసేనపై కూడా నిప్పులు చెరిగారు. చంద్రబాబు కోసం ప్యాకేజి తీసుకుని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుతూ మాట్లాడాడో ప్రజలందరికి తెలుసు. అలాంటి పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పొత్తు కోరుకుంటుందని కలేమైనా వచ్చిందా? అంటూ మరో ట్వీట్ చేశారు . ఇక పార్టీ అధ్యక్షుడు రెండు చోట్లా చిత్తుగా ఓడతాడని అందరికీ ముందే తెలుసు అంటూ విజయ సాయి వ్యాఖ్యానించారు . ఇక నిన్నటికి నిన్న చిరంజీవి పేరును ప్రస్తావించి వీళ్ళను చూస్తే కుక్కలు కూడా మొరగవు అంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications