బాబు ఆఫీస్ చిందరవందర, ఇంటి వద్దే చక్కబెడ్తున్నారు
హైదరాబాద్: సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం చిందరవందరగా కనిపిస్తోందట. సచివాలయం ఎల్ బ్లాక్ ఎనిమిదో అంతస్తులో చంద్రబాబుకు కార్యాలయం కేటాయించారు. ఇందులో గతంలో (సమైక్య ఆంధ్రప్రదేశ్) పంచాయతీరాజ్ డిపార్టుమెంట్ కార్యాలయం ఉండేది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గత నెల 8వ తేదిన ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ ఆయన కార్యాలయం చిందరవందరగా కనిపిస్తోందట. కార్యాలయంలో పాత పేపర్లు, పాత ఫైళ్లు, ఇతరత్రా వస్తువులు పడి ఉన్నాయి. అయితే, సిఎం కార్యాలయం నుండి అధికారులు ఇంకా పని ప్రారంభించక పోవడం వల్లే అలా ఉందట.

చంద్రబాబు సచివాలయంలో తనకు కేటాయించిన కార్యాలయం నుండి పని చేస్తారా లేక బయట నుండి పని చేస్తారా అనే విషయాన్ని పక్కన పెడితే కార్యాలయం వద్ద మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, చంద్రబాబు గతంలో మాట్లాడుతూ.. తనకు సచివాలయంలో కార్యాలయం వద్దని, హైదరాబాదులోని ఇంటి వద్ద నుండే పని చేస్తానని చెప్పారు.
చంద్రబాబు వారంలో మూడు రోజులు గుంటూరు లేదా విజయవాడలో, రెండు రోజులు ఢిల్లీలో ఉండాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. మిగతా రెండు రోజులు హైదరాబాదు నుండి పాలన చేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుండే కార్యకలాపాలు చూడనున్నారు.












Click it and Unblock the Notifications