లోకేష్‌కు క్లోజ్: చంద్రబాబు ఓఎస్డీ రాజీనామా చేస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఓఎస్టీ సీతేపల్లి అభీష్ట రాజీనామా చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. ఆ కారణంగానే ఆయన చంద్రబాబు ఓఎస్టీగా నియమితులయ్యారనే ప్రచారం కూడా ఉంది.
గత కొద్ది రోజులుగా అభీష్ట కార్యాలయానికి రావడం లేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అభీష్ట ఐఎఎస్ అధికారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. లోకేష్‌కు సన్నిహితుడు కావడం వల్లనే అభీష్ట ముఖ్యమంత్రి ఓఎస్డీగా నియమితులయ్యారని ప్రచారంపై గతంలో ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది.

అభీష్టను చంద్రబాబు ఓఎస్డీగా ప్రభుత్వమే నియమించిందని స్పష్టం చేశారు. అయితే, లోకేష్ సూచనతో అభీష్ట పార్టీ శాసనసభ్యుల తీరుపై సర్వే చేయించారు. అయితే, ఈ సర్వే ఫలితాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తనకు అనుకూలంగా ఉన్నవారికి ఒక రకంగా, మిగతావారికి మరో రకంగా ఆయన నివేదికలు ఇచ్చారనే అభిప్రాయం కూడా ఉంది.
ఆభీష్ట చేయించిన సర్వేలపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. సర్వేలో ప్రతికూల ఫలితాలు పొందిన మంత్రులు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అభీష్టపై తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు తీవ్రమైన చర్చనే సాగుతోంది.












Click it and Unblock the Notifications