చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదం: జగన్ చేతికి పదునైన అస్త్రం
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యూహాత్మక తప్పిదంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పదునైన అస్త్రం లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదాను ఇవ్వలేమని కేంద్రం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ప్యాకేజీని స్వాగతించడం వల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.
దాంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీ జరిగే సమయంలో ప్రకటన చేయటం, దానిపై తమ అధినేత అర్ధరాత్రి స్పందించడం వ్యూహాత్మక తప్పిదమని అంటున్నారు. తమ తమ నియోజకవర్గాల నుంచి టిడిపి శాసనసభ్యులకు ప్రతికూల స్పందనలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత వాతావరణంలో కేంద్రం ఇచ్చింది తీసుకోవడం తప్ప మరేమీ చేయలేమని, ప్యాకేజీ వద్దంటే నష్టపోతామని చంద్రబాబు పార్టీ సీనియర్లకు చెప్పినట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన రాజకీయంగా తమ పార్టీకి నష్టం కలిగిస్తుందని శాసనసభ ఆవరణలో టిడిపి ఎమ్మెల్యేల చర్చల్లో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు కొద్ది గంటల ముందు జైట్లీ ప్రకటన చేయడం వల్ల జగన్‌కు అస్త్రం అందించినట్లయిందని అంటున్నారు. బుధవారం ప్రకటన చేయడం వల్ల, అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లయిందని అంటున్నారు.

జైట్లీ ప్రకటన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేసిన దాడిని తమ పార్టీ అసెంబ్లీలో సమర్ధవంతంగా ఎదుర్కొందనే సంకేతాలు పంపించడదానికి చంద్రబాబు ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. ఎప్పుడైనా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే కాబట్టి ఇప్పుడే ఎదుర్కుందామనే ఆలోచన కూడా చంద్రబాబుకు ఉండవచ్చునని చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సాహసమే చేశారనే అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోంది.
మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం జైట్లీ ప్రకటనపై చంద్రబాబు రాత్రికి రాత్రి స్పందించడాన్ని తప్పుపడుతున్నారు. గురువారం శాసనసభ వాయిదా పడిన తర్వాత మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర ప్రకటనను స్వాగతించాల్సిన అవసరాన్ని, తాను ఎందుకు ప్రకటన చేసింది అనే విషయాలను ఆయన వివరించినట్లు చెబుతున్నారు.
ప్యాకేజీని కాదంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని, అందువల్ల జైట్లీ ప్రకటనను స్వాగతించాల్సి వచ్చిందని, మిగతా విషయాలపై తర్వాత ఒత్తిడి తేవచ్చునని చంద్రబాబు వారికి సర్ది చెప్పినట్లు సమాచారం. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్‌కు మాత్రం అస్త్రం అందించినట్లే అయిందనే అభిప్రాయం బలంగా ఉంది. చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేశారనే సంకేతాలను జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడానికి అవకాశం ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications