వివేకా హత్యలో పూర్తిగా కూరుకున్న జగన్-నా పైన నెట్టి రాజకీయ లబ్ది-చంద్రబాబు కామెంట్స్
మాజీ మంత్రి, తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఆరోపించారు. ఈ కేసులో సీబీఐకి ప్రతీ సాక్షి ఇస్తున్న వాంగ్మూలం దీన్ని స్పష్టం చేస్తుందన్నారు. ఈ కేసును తనపైకి నెట్టి జగన్ ఎలా రాజకీయ లబ్ది పొందారో కూడా చంద్రబాబు వివరించారు. వివేకా కేసుతో పాటు పలు అంశాలపై టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్యలో జగన్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.వివేకా హత్యపై తాజాగా బయటకు వస్తున్న వాంగ్మూలాలతో జగనే దోషి అనేది స్పష్టంగా అర్ధం అవుతోందని పార్టీ ముఖ్యనేతలతో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్రబాబు అన్నారు. కేసును మొదటి నుంచి తప్పుదోవ పట్టిస్తున్న జగన్ ను సీబీఐ ముందుగా విచారించాలన్నారు. నాడు సిఎంగా ఉన్న నాపై హత్యానేరం మోపి జగన్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారనేది రుజువయ్యిందన్నారు. తండ్రి హత్యపై న్యాయం చెయ్యాలని కోరిన సునీత పట్ల అన్నగా వ్యవహరించిన తీరుతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారని చంద్రబాబు అన్నారు. విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే హక్కు గాని, సిఎం చైర్ లో కూర్చునే అర్హత గాని జగన్ కు లేవని చంద్రబాబు మండిపడ్డారు.

జగన్ కు చట్టమంటే లెక్కలేదు
వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది, నాపై 12వ కేసు అవుతుంది అని జగన్ వ్యాఖ్యానించడం అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని, తన అవినీతి డబ్బుతో దేనినైనా మేనేజ్ చేయగలననే అహంకారాన్ని స్పష్టం చేస్తోందని చంద్రబాబు అన్నారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యలో సూత్రధారి ఎవరో అనేది ఇప్పుడు తేలిపోయిందని....ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. నాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి....ఇప్పుడు సిబిఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు.

వైఎస్ కోటలో మీ ప్రమేయం లేకుండా తమ్ముడి హత్యా ?
ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్....ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరని అన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుని ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్మి హత్యచేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సీబీఐ విచారణలో అన్ని నిజాలు వెలుగుచూస్తాయన్నారు.












Click it and Unblock the Notifications