తెలంగాణలోనూ ప్రజలు మా వెంటే: చంద్రబాబు జోష్
హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన గ్రామీణ ప్రజలు, రైతులకే ఈ విజయం అంకితమని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తమ పార్టీకి విజయాన్ని అందించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో మూడింట రెండొంతుల మెజారిటీ అందించిన ప్రజానీకానికి శతకోటి వందనాలని ఆయన అన్నారు. తమ పార్టీ పట్ల ప్రజలు చూపిన ఆదరణ చరిత్రాత్మకమని, నవశకానికి నాంది అని ఆయన అన్నారు.
ఈ విజయం ప్రజలదేనని, వారికే అంకితం ఇస్తున్నానని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని రైతాంగం, గ్రామీణ సమస్యలపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ సుజల పథకం, ఎన్టీఆర్ హెల్త్ కార్డులను ప్రవేశ పెడతామన్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసి సుపరిపాలన అందిస్తామన్నారు.

తెలంగాణ ప్రాంతంలోని మండల పరిషత్‌లలో 20 శాతం వరకు తమ పార్టీ గెలుపొందడాన్ని బట్టి ప్రజలు తమ వెంటే ఉన్నారని స్పష్టమైందన్నారు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్, తెచ్చామని టీఆర్ఎస్ మభ్య పెట్టే ప్రయత్నాలు చేశాయని ఆరోపించారు. పదేళ్లుగా కాంగ్రెస్ చేసిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలను మరుగుపరిచి, తాత్కాలికంగా ప్రజలను ఏమార్చారని ఆరోపించారు.
ఉద్యమకారులను, జెఎసిని తెలంగాణ రాష్ట్ర సమితి దూరం పెట్టిందని, బంధుప్రీతితో ముందుకు సాగిందని, శుష్క వాగ్దానాలు చేసిందని ధ్వజమెత్తారు. సీమాంధ్రలో వైసీపీ మద్యం, డబ్బు ప్రలోభాలకు గురి చేసి, టీడీపీపై దుష్ప్రచారం చేసి, లబ్ధి పొందాలని ప్రయత్నించి, గ్రామీణ ప్రజల చేతిలో ఖంగుతిన్నదని అన్నారు. సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి ఆ పార్టీని కూడా సీమాంధ్ర ప్రజలు తరిమికొట్టారని చంద్రబాబు విమర్శించారు.












Click it and Unblock the Notifications