లడ్డూ వివాదంలో టర్నింగ్ లు-మంత్రులతో చంద్రబాబు సమీక్ష-టీటీడీ ఈవోకు కీలక ఆదేశం..!
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపారంటూ సీఎం చంద్రబాబు నేరుగా చేసిన వ్యాఖ్యలపై దేశంలో రాజకీయ పార్టీలతో పాటు అంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు దీనిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా పరిస్ధితిపై మంత్రులతో సమీక్ష చేశారు.
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీంతో ఇవాళ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థ సారధి, సీఎస్ తో ఈ వ్యవహారంపై చంద్రబాబు చర్చించారు. తప్పు చేసిన వారిపై తీసుకోవాల్సిన చర్యలతో పాటు టీటీడీ నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని నిర్ణయించారు.

లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలపై ఇవాళ సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
మరోవైపు తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోందనేది కీలకంగా మారింది. సాయంత్రం టీటీడీ ఈవో నుంచి రిపోర్ట్ రాగానే ఆ తర్వాత దీనిపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో అప్పటి టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులు, ఇంకెవరు పాత్ర ఉందన్న దానిపై ప్రభుత్వం వివరాలు తెప్పించుకుంటోంది.












Click it and Unblock the Notifications