chandrababu ycp ysr congress party jagan ys jagan panchayat elections threatens ycp leaders చంద్రబాబు వైసిపి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వైఎస్ జగన్ పంచాయతీ ఎన్నికలు బెదిరింపులు
జమిలి ఎన్నికలు వస్తే వైసీపీని ఇంటికి పంపిస్తాం..చక్రవడ్డీతో సహా బదులిస్తాం:చంద్రబాబు
సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు కుప్పం టిడిపి శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన చేస్తున్న చంద్రబాబు వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

వైసిపి నాయకుల తాటాకు చప్పుళ్ళకు బెదురుతానా? ప్రశ్నించిన చంద్రబాబు
ఏడాదిన్నరలోజమిలి ఎన్నికలు వస్తే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా పతనం అయిందన్న చంద్రబాబు ప్రజలు తిరుగుబాటు చేస్తే అధికార పార్టీ నాయకులు పారిపోతారు అంటూ వ్యాఖ్యానించారు. గుడుపల్లె , కుప్పం గ్రామీణ మండలాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు బెదిరింపులతో కార్యకర్తలు భయపెట్టాలని చూసిందని, తాను 24 క్లెమోర్ మైన్ లకే భయపడలేదని వైసిపి నాయకుల తాటాకు చప్పుళ్ళకు బెదురుతానా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు .

కుప్పంలో పులివెందుల రౌడీయిజాన్ని జరగనివ్వం
టిడిపి కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వీటన్నిటికీ చక్ర వడ్డీతో సహా బదులు చెప్తామని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. కుప్పంలో పులివెందుల రౌడీయిజాన్ని జరగనివ్వం అని చంద్రబాబు పేర్కొన్నారు. పులివెందుల, పుంగనూరు నియోజకవర్గంలో ఓటేసే పరిస్థితి లేకుండా చేశారని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను అదే విధంగా ప్రవర్తిస్తే పుంగనూరు నేత నియోజకవర్గంలో కూడా ఉండేవాడు కాదు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

తన మీద కోపంతో కుప్పం ప్రజల మీద కక్ష సాధింపు
తనని ఇబ్బంది పెట్టడం కోసం కావాలని ప్రజలపై కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పులివెందులలో టిడిపి గెలవకపోయినప్పటికీ గండికోట ద్వారా అక్కడి ప్రజలకు నీళ్లు ఇచ్చామని కానీ కుప్పంలో ఇప్పటివరకు హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు , రేషన్ తీసేస్తామని, అమ్మఒడి ఆపేస్తామని, అక్రమ కేసులు పెడతామని బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఒక్క సంతకంతో ఆ కేసులను రద్దు చేస్తానన్న చంద్రబాబు
తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలపైన పెట్టిన తప్పుడు కేసులను ఒక్క సంతకంతో రద్దు చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ రాజధర్మాన్ని పాటించాలని చంద్రబాబు హితవు పలికారు.