మీ సాక్షిగా 5 ఫైళ్లపై సంతకాలు, దటీజ్ బాబు: అద్వానీ
విజయవాడ/గుంటూరు: తాను ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు కార్యకర్తలు, ప్రజల సమక్షంలోనే మూడు ఫైళ్ల పైన సంతకాలు చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు... వేదిక పైనుండే రుణమాఫీపై తొలి సంతకం చేశారు.
ఆ తర్వాత పింఛన్లు పెంచుతూ రెండో సంతకం చేశారు. ఎన్టీఆర్ సుజల పథకంపై మూడో సంతకం చేశారు. బెల్టు షాపు రద్దులకు నాలుగో సంతకం పెడుతున్నానని చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60కి పెంచుతూ ఐదో సంతకం పెడుతున్నట్లు చెప్పారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలపై హామీ ఇచ్చారు.

రుణమాఫీ సంతకం ద్వారా రైతులు, డ్వాక్రా సంఘాలు, చేనేత కార్మికులకు రుణాలు రద్దు కానున్నాయి. పింఛన్ ఫైల్ పైన సంతకం ద్వారా వృద్ధులకు, వితంతులకు అక్టోబర్ 2 నుండి రూ.వెయ్యి పింఛన్ రానుంది. గ్రామీణ ప్రజలకు మంచి నీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తీసుకు వచ్చారు.
బిజెపి అగ్రనేతలు, కేంద్రమంత్రులు ఎవరేమన్నారు....
రాజ్‌నాథ్ సింగ్
చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకుందన్నారు. కేంద్రం నుండి సాధ్యమైనంత సహకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉంటుందని చెప్పారు.
అద్వానీ
చంద్రబాబును అభినందించడానికి నా వద్ద పదాల్లేవు. వాజపేయి ప్రభుత్వానికి బాబు చేసిన సేవలు మరువలేనివి. ఎన్డీయే హయాంలో చంద్రబాబుది కీలకపాత్ర. ఇంతమంది ఇక్కడకు రావడం చంద్రబాబు కార్యదక్షతకు నిదర్శనం. ఆంధ్రతో పాటు తెలంగాణ అభివృద్ధి సాధిస్తుంది. కొత్త ప్రభుత్వానికి మోడీ సర్కారు నుండి పూర్తి సహకారం ఉంటుంది.
ప్రకాశ్ సింగ్ బాదల్
స్వర్గీయ నందమూరి తారక రామారావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రకాశ్ సింగ్ బాదల్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు. ఎన్టీఆర్ హయాం నుండి మాకు టిడిపితో మంచి స్నేహం ఉంది.
వెంకయ్య నాయుడు
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సముద్ర తీరం ఎవరికీ లేదు. సమర్థుడైన, అనుభవజ్ఞుడు గల ముఖ్యమంత్రి వచ్చారు. ఓ వైపు ఆనందం, మరోవైపు ఆవేదన ఉంది. విభజనలో కాంగ్రెసు తీరు న్యాయంగా లేదు. రాష్ట్ర విభజన తీరు బాధ కలిగించింది. పోలవరం కోసం ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. కలిసి కలహించుకోవడం కన్నా విడిపోయి కలిసిమెలిసి జీవించడం మేలు. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగువారిగా అందరం ఒక్కటే అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. రాజధాని లేదు. లోటు బడ్జెట్ ఉంది. మందు, విందు, డబ్బులు ఇచ్చినా ఎపి ప్రజలు అభివృద్ధికి కట్టుబడి ఓటు వేశారు.












Click it and Unblock the Notifications