సీఎంవో నుంచే చంద్రబాబు ప్రక్షాళన మొదలు ! ముగ్గురు ఐఏఎస్ ల అవుట్.. !
ఏపీలో తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు ముందుగా వ్యవస్థల్ని ప్రక్షాళన చేసే పని ప్రారంభించారు. ఇందులో భాగంగా గతంలో వైఎస్ జగన్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల్ని ఒక్కొక్కరుగా సాగనంపుతున్నారు. వారు తప్పుకోకపోతే తానే తప్పించేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డిని తప్పుకోవాలని సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు.. తదుపరి ఆదేశాలు ఇచ్చేలోపే ఆయనే సెలవు వెళ్లిపోయారు. అనంతరం ఆయన స్ధానంలో ఇవాళ మరో సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇదే క్రమంలో సీఎంఓలో మిగిలిన ముగ్గురు కీలక ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ముగ్గురికీ ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.

వైఎస్ జగన్ హయాంలో సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను ఇవాళ బదిలీ చేస్తూ జీఏడీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు వారికి ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయాలని మాత్రమే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సీఎంవోలో కీలక అధికారులపై ఒక్కొక్కరిగా బదిలీ వేట్లు పడుతున్నట్లు అర్దమవుతోంది. ఇప్పటికే జగన్ తో పాటు సీఎంవోలో కీలకంగా ఉన్న ధనుంజయ్ రెడ్డి రిటైర్ అయి వెళ్లిపోయారు. ఇవాళ జరిగిన మూడు బదిలీలతో పోలిస్తే మొత్తం నలుగురిపై వేటు పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications