యువత కోసం కఠిన నిర్ణయం తీసుకోబోతున్న చంద్రబాబు?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం ప్రతిరోజు నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో సమావేశమవుతున్నారు. ఆయా స్థానాల్లో సర్వేలద్వారా తెప్పించుకున్న వివరాలను వారిముందు ఉంచి పనితీరు బాగోలేనివారిని సున్నితంగా మందలిస్తున్నారు. మరికొందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 70 శాతం సీట్లు యువతకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. యువతకు అవకాశం కల్పించాలంటే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మార్చాల్సి ఉంటుంది.
Recommended Video

గెలవలేకపోతున్నవారిని గుర్తించి..
కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడమంటే పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన గావించాలి. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ ఎన్నికల్లో గెలవలేకపోతున్నవారిని ఈసారి ఎన్నికలకు దూరం పెట్టబోతున్నారు. అంతేకాకుండా ఇన్‌ఛార్జిలు ఎక్కడెక్కడ పనిచేయడంలేదో గుర్తించి ఒక నివేదిక రూపొందిస్తున్నారు. ప్రజలతో మమేకం అవనివారిని, అసందర్భపు ప్రేలాపనలు చేస్తున్నవారిని, ప్రత్యర్థి పార్టీల నేతలతో వ్యాపారాలు చేసేవారిని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించేవారిని గుర్తించి వారికి సీరియస్‌గా క్లాస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పాతవారిని దూరం పెట్టాలి..
యువతకు సీట్లివ్వాలంటే కొత్తవారిని తీసుకురావాలి.. పాతవారిని దూరం పెట్టాలి.. ఎవరైతే సక్రమంగా పనిచేయడంలేదో వారిని దూరం పెట్టాలి.. సీటివ్వడంలేదనే విషయాన్ని ముందే చెప్పేయాలి.. పాత నాయకత్వం అసంతృప్తికి లోనుకాకుండా చూసుకోవాలి.. ఇలాంటివన్నీ పార్టీలో అంతర్గతంగా సమస్యలు సృష్టిస్తాయి. వీటిని అధిగమించడం సాధారణ విషయం కాదు. నియోకవర్గ ఇన్ఛార్జిలతో సమావేశమవుతున్నప్పటికీ కొందరికి సీట్లు కన్‌ఫార్మ్ చేయడంలేదు. కొందరికే చేస్తున్నారు.

సీట్లు దక్కుతాయా? లేదా?
దీంతో సీట్లు దక్కుతాయా? లేదా? అన్న ఆందోళనలో ఉన్న నేతలు ఏమేరకు పార్టీలో యాక్టివ్‌గా ఉంటారు? అనే అనుమానం తలెత్తుతోంది. తమకు సీటు కన్‌ఫార్మ్ చేయకపోతే అక్కడ కొత్తవారికి అవకాశం కల్పించే అవకాశం ఉందా? అనే కోణంలో ఉన్న ఇన్‌ఛార్జిలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. జిల్లాలవారీగా పార్టీ అధ్యక్షులతో కూడా మాట్లాడుతున్న చంద్రబాబు ఆయా జిల్లాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను, పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతను వారికే అప్పగిస్తున్నారు. నేతలను సమన్వయం చేసుకొని కార్యక్రమాలకు రూపకల్పన చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేస్తున్నారు.












Click it and Unblock the Notifications