మీకే నష్టం, 6నెలల్లో టీ ధనిక రాష్ట్రమైందా: కేసీఆర్‌కు బాబు ప్రశ్న, జగన్‌పై ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే వాహనాల పైన పన్ను వేయడం సరికాదని, అలా వేస్తే వారికే నష్టమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఆయన బుధవారం సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించేందుకు తాను ఎంతో చేశానన్నారు. గత ఆరు నెలల్లోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా అయిందా అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాలు గొడవ పడితే ఇరువురం నష్టపోతామన్నారు. సమస్యల మధ్య పరిష్కారానికి కేంద్రం సహకారం కోరుతామని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

విభజన చట్టం పైన ఇరు రాష్ట్రాల నేతలు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. తెలంగాణకు వచ్చే వారి పైన పన్ను వేస్తే వారికే నష్టమని చెప్పారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేయడమేమిటన్నారు. టీడీపీ నీతివంత పాలన అందిస్తుందన్నారు.
రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని అందుకు కృతజ్ఞతలు అన్నారు. కేంద్రం మరింత సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. మరింత సహకారం కేంద్రం ఇస్తేనే ఏపీ ఇతర రాష్ట్రాలతో సమానంగా ఉంటుందన్నారు. రాజధాని కోసం 33వేల ఎకరాలు తీసుకోవడం ప్రపంచంలోనే మొదటిసారి అన్నారు. ఇది ప్రజలు కోరుకున్న విభజన కాదన్నారు. ఏపీకి కేంద్రం సహకరించాలన్నారు.












Click it and Unblock the Notifications