చంద్రబాబు క్లాస్, తీవ్ర హెచ్చరిక: తగ్గిన భూమా, శిల్పా బ్రదర్స్
విజయవాడ: కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, శిల్పా సోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇరువురు నేతలకు కూడా ఆయన గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు వారితో మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఇద్దరు నేతలూ కలిసుండాలని సూచించారు. నేతలు పరస్పర విమర్శలకు దిగితే.. కార్యకర్తల్లో మనోస్థైర్యం దెబ్బతింటుందని, దానివల్ల పార్టీకి నష్టమే తప్ప లాభముండదని హెచ్చరించారు.
విభేదాలు లేకుండా పార్టీని నడపాలని సూచించారు. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమన్వయంతో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అందరూ కలిసి ప్రభుత్వానికి, పార్టీకి పని చేయాలని హితవు పలికారు.

వాదనలు వినిపించిన భూమా, శిల్పా
సోమవారం నుంచి భూమా, శిల్పాల మధ్య సయోధ్యకు టిడిపి అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు పిలుపుతో టీడీపీ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్యే), శిల్పా మోహన్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), శిల్పా సోదరుడు, పార్టీ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ తదితరులు ఆదివారం రాత్రే విజయవాడకు వచ్చారు.
చంద్రబాబు సూచన మేరకు కళా వెంకట్రావు, జిల్లా ఇంఛార్జ్ అచ్చెన్నాయుడులు రంగంలోకి దిగారు. భూమా, శిల్పా సోదరులతో కలిసి, విడివిడిగా భేటీ అయ్యారు. వారు ఎవరి వాదనలు వారు వినిపించారు. తొలుత ఇరువర్గాలు బెట్టు చేసినా, ఆ తర్వాత తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇరువురి మధ్య దాదాపు సయోధ్య కుదిరినట్లుగా తెలుస్తోంది. అయితే, ఎంత మేరకు నిలబడుతుందో చూడాలి.
అంతకుముందు భూమా మాట్లాడుతూ... జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని చెప్పారు. తమ రెండు వర్గాల మధ్య వ్యక్తిగత సమస్యలేమీ లేవన్నారు. చంద్రబాబు మార్గదర్శనంలో కలిసి నడిచేందుకు సిద్ధమేనని చెప్పారు.
తమ తండ్రులు, తాతల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులతో పాటు వర్గాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ... చర్చల్లో పురోగతి ఉందన్నారు. మరోమారు చంద్రబాబు జరిపే చర్చల్లో పూర్తి స్థాయి ఫలితం వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications