బీజేపీ నీతులు చెప్పి దిగజారింది, మాల్యాతో విజయసాయి పోలిక: అక్కడే బాబుకు ఇరకాటం!
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై మరోమారు నిప్పులు చెరిగారు. నీతులు చెప్పే బీజేపీ యూపీలో ఒక్క రాజ్యసభ సీటు కోసం ఎంతకు దిగజారిందన్నారు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలే తక్కువగా ఉన్నప్పటికీ విలువల కోసం పోటీ పెట్టలేదన్నారు.
అయితే, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ చేసింది నైతికంగా తప్పే కావొచ్చునని, కానీ విలువల కోసం తాము పోటీ పెట్టలేదని చంద్రబాబు చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే గత నాలుగేళ్లుగా పార్టీ ఫిరాయించిన నేతలపై చర్యలు తీసుకోకపోవడమే అందుకు నిదర్శనం అంటున్నారు.

పార్టీ మారిన సంగతేమిటి?
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో దాదాపు 23 మంది టీడీపీలో చేరారు. అందులో నలుగురు.. భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి తదితరులు మంత్రులు అయ్యారు. వీరిపై చర్యలు తీసుకోమని వైసీపీ పదేపదే కోరినా టీడీపీ తీసుకోలేదని గుర్తు చేస్తున్నారు.

పదేపదే విజయసాయి రెడ్డి టార్గెట్
చంద్రబాబు, టీడీపీ నేతలు పదేపదే విజయసాయి రెడ్డి పీఎంవోలో ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్ లేదా విజయసాయి రెడ్డి ప్రజాప్రతినిధి అనే విషయం మరిచి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు. చంద్రబాబుపై తాను సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని ఇప్పటికే విజయ సాయి రెడ్డి చెప్పారు.

మాల్యా, విజయసాయిలకు చెరో న్యాయమా?
తాజాగా, చంద్రబాబు మాట్లాడుతూ.. విజయ్ మాల్యాకు ఓ న్యాయం, విజయసాయికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, జగన్ ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయలేదని కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మాల్యా దేశం వదిలి వెళ్లిపోయారని, విజయసాయి పీఎంవోలో ఉంటున్నారన్నారు. ఇద్దరు ఆర్థిక నేరస్తులేనని వారి మధ్య వ్యత్యాసం ఏమిటన్నారు.

నాలుగేళ్ల తర్వాత ఇలా అంటారా?
టెలికాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిలదీస్తే బీజేపీకి నచ్చడం లేదని, హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామన్నారని, ఈఏపీలకు నిధులు ఇస్తామని చెప్పి కనీసం మెమోలు కూడా ఇవ్వలేదని, నాలుగేళ్లయ్యాక ఇప్పుడు స్పెషల్ పర్సస్ వెహికిల్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్ షా లేఖకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవి కూడా ఇవ్వడం లేదన్నారు.

బీజేపీ నీతులు చెప్పి దిగజారింది
నీతులు చెప్పే బీజేపీ ఎంతకు దిగజారిందని, యూపీలో ఒక్క రాజ్యసభ సీటు కోసం ఎంతకు దిగజారిందో తెలియదా అని చంద్రబాబు అన్నారు. కేంద్రం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందన్నారు. నా మీద ప్రభుత్వం కేసులు వేయడం ఏమిటని, ముందు అమిత్ షా కొడుకు కేసు సంగతి ఏమిటన్నారు. హోదా ఎవరికీ ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పిందని వక్రీకరించారన్నారు.












Click it and Unblock the Notifications