రాజధానికి ఇన్ని కోట్లెందుకు: వీర్రాజు సంచలనం, పద్దులతో ఢిల్లీకి బాబు
విజయవాడ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన సోమవారం నాడు మండిపడ్డారు. ఈ రోజు చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ప్రత్యేక హోదా, ఏపీకి నిధులు, విభజన హామీల పైన ప్రధాని మోడీతో చర్చించనున్నారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సోము వీర్రాజు సోమవారం సాయంత్రం చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. రాజధాని అమరావతి నిధుల పైన ఆసక్తికర వ్యాఖ్యలు విశాఖపట్టణంలోని బీజేపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో విభజించబడిన ఏ రాష్ట్రమూ రాజధాని కోసం ఇంతలా వెంపర్లాడలేదని వ్యాఖ్యానించారు. జార్ఖాండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్.. ఇలా ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయని, వాటిల్లో ఏ రాష్ట్రమూ రాజధాని కోసం ఇంతలా వెంపర్లాడలేదన్నారు.

ఏపీ రాజధాని కోసం మాత్రం లక్షల కోట్ల రూపాయలు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు తమ భూములను ఉచితంగా ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి రాజధాని నిర్మాణానికి రూ.లక్షల కోట్ల ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు.
అధికార వికేంద్రీకరణ బీజేపీ అభివృద్ధి సిద్ధాంతమన్నారు. ఒకేచోట నిధులు ఖర్చు చేయాలనుకోవడం లేదన్నారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు ఇచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రోడ్ల నిర్మాణానికి నితిన్ గడ్కరీ నిధులు కేటాయించారని గుర్తు చేశారు.
ఢిల్లీకి పయనమైన చంద్రబాబు
ప్రత్యేక హోదా, విభజన హామీల విషయమై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ విమానం ఎక్కారు. విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. మంత్రులెవరూ వెంట రాకుండానే కేవలం ఒకరిద్దరూ కీలక శాఖల అధికారులతో వెళ్లారు.
ప్రధాని మోడీ ముందు పెట్టాల్సిన పద్దుల చిట్టాలను కూడా వెంట తీసుకెళుతున్నారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే అక్కడ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు పార్టీ ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు.. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. కరువుపై చర్చ తర్వాత హోదాపై చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications