అందుకే బాబుకు 'రాజధాని' బాధ్యతలు, జగన్ సీఎం అయి ఉంటే...! రైతులకి ఇన్విటేషన్స్
గుంటూరు: ఏడుకొండల వాడి పాదాల చెంతనే నేను జన్మించానని, అందుకే తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ బాధ్యతలు దక్కాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు ఆదివారం అన్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ అన్న ప్రాసన కార్యక్రమం తిరుమలలో ఘనంగా జరిగింది.
చంద్రబాబు అక్కడే సత్రంలో సామూహిక భోజనం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని పవిత్ర నదీ జలాలను నూతన రాజధాని నిర్మాణంలో ఉపయోగిస్తామన్నారు. ప్రపంచ దేశాల రాజధానుల మధ్య అమరావతిని నిలబెడతామన్నారు.
తిరుపతిలో కార్యక్రమం అనంతరం చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం ఐదున్నర గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును, అంతకుముందు ఐదు గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలుస్తారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తారు.

నారావారిపల్లె నుంచి మంత్రి రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో వేల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నెల్లూరుకు చేరుకోగానే టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల భాగస్వామ్యంతో చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారని, రాజధాని అందరిదని ప్రజలు భావిస్తున్నారన్నారు.
అభివృద్ధిని జగన్ ఓర్చుకోలేకపోతున్నారు: సూర్యనారాయణ
అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే సూర్యనారాయణ విమర్శించారు. జగన్ సీఎం అయి ఉంటే రైతులు భూములు అమ్ముకొని కోట్లు సంపాదించేవారన్నారు. జగన్ అమరావతి శంకుస్థాపనకు రాకపోవడం చారిత్రక తప్పిదమన్నారు.
రైతులకు ఆహ్వానపత్రాలు
గుంటూరు జిల్లా లింగాయపాలెంలో మంత్రులు రైతులకు ఆహ్వానపత్రాలు అందించారు. పరిటాల సునీత, మృణాళిని, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడులు కలిసి ఆహ్వాన పత్రాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications