Chandrababu: శ్వేతపత్రాలపై చంద్రబాబు అనూహ్య నిర్ణయం ! కారణమిదేనా ?
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో గత వైసీపీ పాలనపై శ్వేతపత్రాలు కూడా విడుదలవుతున్నాయి. ఇప్పటికే అమరావతి, పోలవరం, మైనింగ్, సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. వైసీపీ పాలనలో ఆయా రంగాల్లో రాష్ట్రం ఎలా నష్టపోయిందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవాళ మాత్రం చంద్రబాబు శ్వేతపత్రాలపై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గత వైసీపీ పాలనపై 7 నుంచి 8 శ్వేతపత్రాలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో గత వైసీపీ పాలనలో ఆయా రంగాల్లో చోటు చేసుకున్న అక్రమాలను గణాంకాలతో సహా అధికారుల నుంచి తీసుకుని శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదల చేసిన శ్వేతపత్రాల్ని చంద్రబాబు సచివాలయం నుంచి విడుదల చేశారు. ఇదే క్రమంలో ఇవాళ శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమయ్యారు. కానీ హఠాత్తుగా వెనక్కి తగ్గారు.

రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలు ఉన్నాయి. వీటిని త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం వేరే ఉందనే చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వరుసగా చిన్నారులపై అత్యాచారాలు, ప్రత్యర్ధి వైసీపీ నేతలపై దాడులు చోటు చేసుకుంటున్నాయి. విన్న వినుకొండలో వైసీపీ నేత రషీద్ నరికివేత, ఇవాళ పుంగనూరులో రాళ్ల దాడి ఇలా వరుసగా శాంతిభద్రతలను ప్రశ్నించేలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం ఇస్తే విపక్షాలు టార్గెట్ చేసే అవకాాశం ఉండటంతో వెనక్కి తగ్గారని చెప్తున్నారు. ఎలాగో దీనిపై వెనక్కి తగ్గారు కాబట్టి మిగిలినవి కూడా అసెంబ్లీలోనే ఇచ్చేస్తే మీడియా ప్రశ్నలతో ఇబ్బంది ఉండదని భావించినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications