జైలులో చంద్రబాబు కీలక నిర్ణయం - మద్దతుగా భువనేశ్వరి..!!
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ స్కాం(Skill Scam)లో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ నెల 3న సుప్రీం(Supreme Court)లో చంద్రబాబు కేసు విచారణకు రానుంది.
చంద్రబాబు అరెస్ట్ సమయం నుంచి టీడీపీ(TDP) శ్రేణులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా చంద్రబాబు రాజమండ్రి(Rajahmundry) జైలులోనే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు నిరసన దీక్ష(Deeksha) చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

జైలులో దీక్ష: గాంధీ జయంతి నాడు జైలులోనే చంద్రబాబు దీక్షకు దిగనున్నారు. తనపైన నమోదు చేసిన స్కిల్ స్కాం కేసు అక్రమమని వాదిస్తున్న చంద్రబాబ..నిరసనలో భాగంగా జైలులోనే దీక్షకు నిర్ణయించారు. తనకు జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.
గాంధీ జయంతి రోజు జైల్లో దీక్ష చేయాలని చంద్రబాబును కోరామని, ఆయన అంగీకరించారని తెలిపారు. అదే రోజున ఆయన సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ఒకరోజు దీక్ష చేస్తారని తెలిపారు. ఇందుకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

టీడీపీ నిరసనలు: అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని వెల్లడించారు. ఇక, శనివారం రాత్రి టీడీపీ పిలుపులో భాగంగా పార్టీ శ్రేణులు మోత నిర్వహించారు. లోకేశ్ ఢిల్లీలో..భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలో నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
విజయవాడలోనూ పార్టీ ముఖ్య నేతలు మోత ద్వారా నిరసన వ్యక్తం చేసారు. పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజ్ మదర్ థెరీసా బొమ్మ వద్ద నిరసన నిర్వహించారు. పార్టీ శ్రేణులు విజిల్ ఊదుతూ గంటల మోగిస్తూ పలకలు మోగిస్తూ నిరసన వ్యక్తం చేసారు.

కోర్టుల్లో విచారణ: అక్టోబర్ 2న జైలులో చంద్రబాబు..రాజమండ్రిలో భువనేశ్వరి దీక్ష వేళ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు దీక్షలకు సిద్దం అవుతున్నారు. ఇక, ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటీషన్ విచారణకు రానుంది. తన పైన నమోదు చేసిన కేసులో హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ కొట్టివేయటంతో సుప్రీంను ఆశ్రయించారు.
ఇదే సమయంలో ఓటు కు నోటు కేసులోనూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన పిటీషన్ ఈ నెల 4న లిస్టు అయింది. ఇటు ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లు విచారణకు రానున్నాయి. ఈ సమయంలోనే నిరసనల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications