అమిత్ షాను చంద్రబాబు ఫిక్స్ చేస్తున్నారా, అస్త్రం అందిస్తున్నారా - మిస్ ఫైర్..!?
టీడీపీ..బీజేపీ మధ్య ఏం జరుగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ ప్రభుత్వంపైన అమిత్ షా వ్యాఖ్యలతో ఇక పాత మిత్రుల కలయిక పైన అంచనాలు మొదలయ్యాయి. వైసీపీ నేతలు అదే తరహాలో సంకేతాలు ఇచ్చారు.
ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు...అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చూస్తే బీజేపీని ఫిక్స్ చేసేలా ఉన్నాయి. జగన్ ను టార్గెట్ చేసేందుకు టీడీపీ అమలు చేస్తున్న ఈ కొత్త ఎత్తుగడ తో గురి కుదరుతుందా..మిస్ ఫైర్ అవుతుందా.

చంద్రబాబు..అచ్చెన్న వ్యాఖ్యలు: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీతో పొత్తుపై కొత్త చర్చలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదన ఆచరణ రూపంలోకి వస్తోందని అంచనాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా విశాఖ వేదికగా కేంద్ర హోం మంత్రి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చకు బలం చేకూరింది. ముఖ్యమంత్రి జగన్ తనకు బీజేపీ మద్దతు లేదంటూ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోయాయి.
కానీ, బీజేపీ..టీడీపీ పొత్తు పైన రెండు పార్టీల నుంచి అధికారిక స్పందన లేదు. జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలతో తిరిగి బీజేపీ, టీడీపీ కలుస్తున్నాయనే ప్రచారం మాత్రం ఊపందుకుంది. ఈ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బీజేపీని ఇరకాటంలోకి నెట్టేలా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీసాయి.
అమిత్ షా ను ఫిక్స్ చేస్తున్నారా: వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అమిత్ షా ..నడ్డా చేసిన వ్యాఖ్యల పైన చంద్రబాబు..అచ్చెన్నాయుడు స్పందించారు. ఏ రాష్ట్రానికి లేనంతగా అప్పులకు కేంద్రం ఏపీకి ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు సీఎం జగన్ కు బీజేపీ అండ లేకుండానే జరిగిందా అని నిలదీసారు. ఏ సంబంధాలు లేకపోతే ఇన్ని సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా కుప్పం కేంద్రంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ ప్రభుత్వం అవినీతి పైన ప్రకటనలు కాదు..చర్యలు ఎప్పుడని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ నాయకత్వాన్ని ఫిక్స్ చేసే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ తో పొత్తు ద్వారా వైసీపీ పైన పై చేయి సాధించాలనేది చంద్రబాబు ప్రయత్నం. ఇక్కడే కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి.

పొత్తు ఉండేనా..లేదా: 2019 ఎన్నికల సమయంలోనూ నాటి చంద్రబాబు ప్రభుత్వం పైన ప్రధాని మోదీతో సహా ఇదే బీజేపీ నేతలు ఈ తరహాలోనే ఆరోపణలు చేసారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం కార్డుగా మారిందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు చేసారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పైనా ఆరోపణలు మొదలు పెట్టారు. అదే సమయంలో కేసులు..అరెస్టులు..సీబీఐ వ్యవహారాల్లో బీజేపీ మద్దతు ఇస్తోందంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపైన ఆ పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
దీని ద్వారా బీజేపీ..టీడీపీ మధ్య పొత్తు కుదిరేనా..లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. బీజేపీని ఫిక్స్ చేసి జగన్ ను టార్గెట్ చేయాలనే లక్ష్యంతో టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అదే జరిగితే బీజేపీ, వైసీపీ చేతికి టీడీపీ మరోసారి అస్త్రం అందించినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications