కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి: జైట్లీ బడ్జెట్‌పై చంద్రబాబు ఆసంతృప్తి
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులు చూస్తే కళ్ళ వెంట నీళ్ళు తిరుగుతున్నాయని, మరీ ఇంత అన్యాయమా? ఏం తప్పు చేశామని మనకీ శిక్ష అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులపై చర్చ జరిగింది. తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల వ్యూహ కమిటీ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ సాగింది.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారని, మొదట వారికి కూడా కొంత ఇబ్బంది ఉండవచ్చని అనుకున్నామని, కానీ పతిసారీ ఇదే పరిస్ధితి పునరావృతమవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన తర్వాత అధ్వానమైన ఆర్ధిక పరిస్ధితిలో రాష్ట్రం ఏర్పడిందని కూడా అన్నారు.
విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా కేంద్రమే అనేక హామీలు ఇచ్చిందనిస ప్రధానమైనవి ఏవీ నెరవేరడం లేదని అన్నారు. బడ్జెట్ లోటు భర్తీ చేస్తామని చెప్పారు. 16 వేల కోట్లకు రూ.3 వేల కోట్లు కూడా ఇవ్వలేదని, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఊసే లేదని ఆయన అన్నారు.

పోలవరానికి ఏడాదికి రూ.4 వేల కోట్లు చొప్పున ఇస్తే తప్ప నాలుగేళ్లలో పూర్తయ్యే పరిస్ధితి లేదని బాధపడ్డారు.
ఈ బడ్జెట్‌లో నామమాత్రంగా రూ.వంద కోట్లు కేటాయించారని, ఈ లెక్కన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందని ఆయన అన్నారు. పోలవరానికి నాబార్డ్ నిధులు గ్రాంటుగా రావనిస వాటిని రాష్ట్రం తన ఖాతా నుంచి చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని కేంద్రమే నిధులు ఇస్తుందన్నారని, ఇప్పుడు రుణం ఇస్తామని అంటున్నారని, ఆ ప్రాజెక్టుకు ఇప్పటివరకు మనం పెట్టిన ఖర్చును ఎంత తిరిగి ఇచ్చేదీ బడ్జెట్లో ఎక్కడా చెప్పలేదని చంద్రబాబు అన్నారు.
మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా హామీ ఇచ్చామని, ఇలాగైతే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్ చాలా అసంతృప్తికి గురి చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల అన్నారు.












Click it and Unblock the Notifications