ఎంతో చేయాలి, టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ రాజకీయమే: బాబు
న్యూఢిల్లీ: సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేయాల్సింది ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్తగా ఏర్పడిన ఏపీ పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకూ కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా సహకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీకి రావాల్సిన నిధులు, హామీల అమలుపై శుక్రవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఆయన భేటీ అయ్యారు.
విభజన చట్టంలోని అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పారిశ్రామికాభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన 15 శాతం రాయితీలు ఏమాత్రం సరిపోవన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు ఇచ్చిన తరహాలో ఏపీకి పారిశ్రామిక ప్యాకేజీ ఇవ్వాలని, లేదంటే ఆ స్థాయి ప్యాకేజీలు, అదనపు రాయితీలు ఇవ్వాలని జైట్లీని కోరానని తెలిపారు. జైట్లీ ఇంకా ఎక్కువ రాయితీలు, నిధులు ఇచ్చి ఆదుకోవాలన్నారు.
విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోటు ఆదాయం రూ.15,350 కోట్లుగా నిర్థారించారని, అయితే ఇప్పుడు అది రూ.17,786 కోట్లకు పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014-15 పద్దుల ఆధారంగా లోటు బడ్జెట్‌ను భర్తీ చేయాలని జైట్లీని కోరానన్నారు. కాగ్ నివేదిక ఆధారంగా లోటు ఆదాయాన్ని భర్తీ చేస్తామని జైట్లీ చెప్పారని చంద్రబాబు తెలిపారు. అయితే, కేంద్రం వద్ద కూడా నిధులు లేవని, వారు కూడా ప్రణాళికా బడ్జెట్‌లో కోతలు విధించారని చంద్రబాబు చెప్పారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు సహకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని జైట్లీ తెలిపారని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించటంతో ప్రజల్లో కూడా పలు అనుమానాలు తలెత్తాయని, దీంతో కేంద్ర ప్రభుత్వం 2014-15 సంవత్సరానికి గాను రూ.250 కోట్లు కేటాయించిందని చంద్రబాబు చెప్పారు. ఇకపై ఎంత ఖర్చు చేస్తే అంత మొత్తం నిధుల్ని చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాము పట్టుబడుతున్నామని తద్వారా 90 శాతం గ్రాంటు, పది శాతం రుణంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఈనెల 31వ తేదీలోపు ఎంత వీలైతే అంత మేరకు నిధుల్ని విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారని బాబు తెలిపారు.
రాష్ట్రంలో 11 కేంద్రీయ విద్యా సంస్థల ఏర్పాటుకు విభజన చట్టంలో హామీ ఇచ్చారని, మరొకటి కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారని చంద్రబాబు చెప్పారు. అనంతపురంలో కేంద్ర పన్నుల సంస్థకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏప్రిల్ 4న శంఖుస్థాపన చేస్తారని, మరో ఏడు సంస్థలకు వీలైనంత త్వరగా శంఖుస్థాపన చేయాలని, రాబోయే విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు నిర్వహించాలని కోరానన్నారు.
మే నెలాఖరుకు రాజధాని మాస్టర్ ప్లాన్
ప్రధాన రాజధాని (కోర్ కేపిటల్) ప్రాంత మాస్టర్ ప్లాన్ మే నెలాఖరు నాటికి వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. అందులో 25 వేల మంది ప్రభుత్వోద్యోగులకు నివాసం, ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు కార్యాలయం, న్యాయమూర్తులకు నివాసాలు మొదలైనవన్నీ వస్తాయని చెప్పారు. హైకోర్టును ఇప్పటికిప్పుడు ఏపీలో ఏర్పాటు చేయాలంటే వసతి కల్పించటం సాధ్యం కాదన్నారు. రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో కాలమే చెబుతుందని, ఎలా అభివృద్ధి చేస్తామన్నది కేంద్రసాయంపై ఆధారపడి ఉంటుందని బాబు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.1000 కోట్లు మంజూరు చేయనుందని, మరో రూ.500 కోట్లు ఇచ్చేందుకూ సంకేతాలిచ్చిందని, మరో రూ.500 కోట్లు ఇవ్వాలని తాను కోరానన్నారు. రాజధానికి నిరంతరం నిధులు ఇస్తూనే ఉండాలని, అప్పుడే రాజధానిని అభివృద్ధి చేయగలుగుతామని కేంద్రానికి తాను చెప్పానన్నారు. రాజధానిని ‘నిర్మించు-నిర్వహించు-బదిలీ చేయి' (బీఓటీ), పీపీపీ పద్ధతుల్లో అభివృద్ధి చేస్తామని, కొన్నింటిని మాత్రం ప్రభుత్వమే చేపడుతుందన్నారు.
సస్పెన్షన్ రాజకీయమే..
రాష్ట్రంలో మరింత రాజకీయ స్థిరత్వం రావాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాల్సి ఉందని, దానికోసం కూడా కృషి చేస్తున్నానన్నారు. కాగా, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బలపర్చిన అభ్యర్థి ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయటాన్ని రాజకీయంగా చూస్తున్నానన్నారు. విశాఖపట్టణం కేంద్రంగా ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. కాగా, చంద్రబాబు కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, నౌకాశ్రయాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.
ఏపీ అభివృద్ధికి సహకరిస్తాం: అమిత్‌షా
విభజన చట్టం కింద ఇచ్చిన హామీలనే కాక కొత్త రాష్ట్రమైన ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీ సీఎం చంద్రబాబుకి హామీ ఇచ్చారు. శుక్రవారం చంద్రబాబు అమిత్‌షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. టీడీపీ పూర్తి మద్దతు ఇచ్చినందుకే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని అమిత్‌షా ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసినట్లు చంద్రబాబు మీడియాతో తెలిపారు.












Click it and Unblock the Notifications