బాబు, వెంకయ్య కుట్ర: పోలవరంపై హరీష్ రావు
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం వెనక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి కుట్ర లేదా అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత టి. హరీష్ రావు ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతామని చెప్పినప్పుడే తాము వ్యతిరేకించామని ఆయన చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతామని అన్నప్పుడు తెరాస వ్యతిరేరించలేదని వెంకయ్యనాయుడు అనడంలో నిజం లేదని, ఆ మాటలను వెంకయ్య విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు. తాము ఆర్డినెన్స్‌కు వ్యతిరేకమని చెప్పామని, అది రాజ్యాంగ విరుద్ధమని కూడా చెప్పామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై బిజెపికి ప్రేమ ఉంటే ఆర్డినెన్స్‌ను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ను ఎందుకు ఆమోదించాల్సి వచ్చిందని ఆయన అడిగారు. కాంగ్రెసు ఆర్డినెన్స్ తెచ్చి ఉంటే బిజెపి ఆపాల్సి ఉండిందని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లేఖ రాయడం వల్లనే కాంగ్రెసు ఆర్డినెన్స్‌ను ఆపేసిందని ఆయన చెప్పారు.
ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతున్నారని కెసిఆర్ చెప్పినా తెలంగాణ ముఖ్య నాయకులు పట్టించుకోలేదని ఆయన చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బిజెపి, టిడిపి, కాంగ్రెసు తెలంగాణ నేతలు ఎందుకు వ్యతిరేకించడం లేదని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమో, సీమాంధ్ర చంద్రబాబు ముఖ్యమో తెలుగుదేశం తెలంగాణ నేతలు తేల్చుకోవాలని ఆయన అన్నారు.
పోలవరం ముసుగులో అటవీ సంపదను, జలవనరులను దోచుకుపోయే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే 460 మెగావాట్ల సీలేర్ పవర్ ప్లాంట్ కూడా సీమాంధ్రకు వెళ్తుందని, సీలేర్ పవర్ ప్లాంట్‌ను కూడా తరలించుకుపోయేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక ప్రజలు తెలంగాణలోనే ఉంటామని, సీమాంధ్రలో కలవబోమని స్థానిక ప్రజలు చెప్పినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications