ఆరెస్సెస్ మెప్పు కోసమే: బాబుపై నారాయణ, జగన్‌పై సుజాత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు పైన సీపీఐ నేత నారాయణ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారన్నారు. అధిక సంతానాన్ని కనాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. సంఘ్ పరివార్ మెప్పు కోసం చంద్రబాబు తాపత్రయ పడతున్నారన్నారు. బీజేపీని నుమ్ముకుంటున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో గట్టి గుణపాఠం ఎదురవుతుందన్నారు.
పార్టీ ఉనికి కోసమే జగన్ దీక్ష: సుజాత
ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయాలన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత తప్పు పట్టారు. పార్టీ ఉనికి కాపాడుకోవటం కోసమే జగన్ దీక్షకు దిగుతున్నారని ఆమె విమర్శించారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటం చూసి జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతల బినామీల ఖాతాలే ఎక్కువగా ఉన్నాయన్నారు.
చంద్రబాబు మెప్పు కోసం: పార్థసారథి
చంద్రబాబు మెప్పు కోసమే కొందరు టీడీపీ నేతలు తమ పార్టీ అధినేత జగన్ పైన విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. మహిళలు, రైతుల సమస్య పరిష్కారం కోసం జగన్ దీక్ష చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలకు వ్యవసాయం, పంట రుణాలకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆధార్ కార్డు ఉన్న చంద్రబాబు ఏపీ సీఎం అవగా లేనిది, ఏపీలో ఆధార్ కార్డులు ఉన్న రైతులకు రుణమాఫీ వద్దా అని ప్రశ్నించారు.
బీబీనగర్ నిమ్స్ స్థానంలో ఎయిమ్స్..
బీబీనగర్ నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. ఎయిమ్స్ ఏర్పాటైతే అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంటుందని ఉప ముఖ్యమంత్రి రాజయ్య మంగళవారం చెప్పారు. అందుకే సీఎం అలాంటి ఆలోచన చేస్తున్నారన్నారు.
బీబీనగర్ నిమ్స్‌కు నాలుగువందల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, ఎయిమ్స్ కోసం మరికొంత స్థలం కేటాయిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేసి బీబీనగర్‌ను స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దేందుకు నిర్ణయించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications