అధికారులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్..!సర్వేల ఎఫెక్ట్ ? ఐవీఆర్ ఫీడ్ బ్యాక్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అలాగే తాజాగా సంక్షేమంపైనా ఫోకస్ పెట్టింది. అయినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్షేత్రస్ధాయిలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా అధికారుల తప్పిదాలు ప్రభుత్వానికి చుట్టుకుంటున్నాయి. ఈ ప్రభావం తాజాగా వెలువడిన సర్వేల్లో కనిపించింది. దీంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది.
ఇవాళ సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్ష చేశారు. ఇందులో ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని తేల్చిచెప్పారు. జీరో కరెప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలన్నారు. అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్టు ఐవీఆర్ఎస్, సీఎస్‌డీఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని సీఎం సూచించారు. సంక్షేమం, ఉద్యోగాలకల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలన్నారు.
175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, ఆగస్ట్ 15 కల్లా అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర కింద అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించడం మరింత మెరుగ్గా జరగాలన్నారు. చౌకధరల దుకాణాలను పెంచడం, నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. అలాగే ఉచిత ఇసుక విధానంపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు.

పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 85 శాతం మంది, ఇంటిదగ్గరే ఇస్తున్నారని 87.8 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బావుందని 83.9 శాతం మంది ఐవీఆర్‌ఎస్ ద్వారా తెలిపారు. అన్న క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉన్నాయని 80.5 శాతం, ఆహారం నాణ్యత బావుందని 79.3 శాతం, సమయపాలన పాటిస్తున్నారని 80.8 శాతం మంది చెప్పారు. ఆస్పత్రుల్లో సేవలపై 68.4 శాతం, రక్త పరీక్షలపై 55 శాతం, ఉచిత మందుల పంపిణీపై 65.5 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 71.3 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.
మున్సిపల్ సేవల్లో రోజూ చెత్త సేకరణపై 68.1 శాతం, 24 గంటల్లో చెత్త డంప్ తరలింపుపై 57 శాతం సంతృప్తి చెందారు.
ఆలయాల్లో దర్శనం బావుందని 68 శాతం , సౌకర్యాలు బావున్నాయని 63.6 శాతం , ప్రసాదం నాణ్యత బావున్నాయని 77.7 శాతం భక్తులు చెప్పారు. ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్ విషయంలో 53.4 శాతం, నీటి సౌకర్యంపై 45.2 శాతం, టాయిలెట్స్‌పై 56 శాతం, బస్సు సమయం-రూట్ వివరాలపై 61.5 శాతం, 69 శాతం సమయపాలనపై, 72.4 శాతం సిబ్బంది ప్రవర్తన పై, 69.7 శాతం భద్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications