తలబద్దలవుతోంది: చంద్రబాబు, నేతలకు టిక్కెట్ వార్నింగ్, దెయ్యాలు తీసుకెళ్లేవి..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పార్టీ నేతలకు క్లాస్ పీకారు. పని చేయకుంటే ఎవరినైనా పక్కన పెట్టేస్తానని హెచ్చరించారు.
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పార్టీ నేతలకు క్లాస్ పీకారు. పని చేయకుంటే ఎవరినైనా పక్కన పెట్టేస్తానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో నేతల పని తీరు ఆధారంగానే టిక్కెట్లు ఇస్తానని చెప్పారు. అందరు కూడా విభేదాలు వీడి పార్టీ కోసం పని చేయాలని, లేదంటే ఇబ్బందులు తప్పవన్నారు.

తలబద్దలవుతోంది
పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజల అవస్థలు చూస్తుంటే తల బద్దలవుతోందని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ తో పోలిస్తే డిసెంబర్ లో కష్టాలు మరింతగా పెరిగాయన్న భావన ప్రజల్లో ఉందని, తక్షణం సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.

టిడిపి కార్యకర్తల సమావేశంలో..
విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు స్వాగతించాల్సిన అంశమే అన్నారు. ప్రజలు అవస్థలు పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంతో పాటు బ్యాంకర్ల పైన కూడా ఉందని చెప్పారు. వారు తమ పనిని నూరు శాతం సంతృప్తికరంగా చేస్తున్నట్టు కనిపించడం లేదన్నారు.

నెలన్నర గడుస్తున్నా..
నోట్ల రద్దు జరిగిపోయి నెలన్నర గడుస్తున్నా, ప్రజలు ఇంకా బ్యాంకుల్లో క్యూలైన్లలో నిలబడటం ఏమిటన్నారు. తక్షణం సమస్యను పరిష్కరించే మార్గం కూడా తనకు కనిపించడం లేదన్నారు. ఆర్బీఐ నుంచి మరింతగా నగదు నిల్వలు బ్యాంకులకు రావాల్సి ఉందని చెప్పారు.

చిన్న నగదు కావాలి
ప్రజలకు చాలినంత చిల్లర ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు రూ.500, రూ.100 కొత్త నోట్లను ఇవ్వాలని ఇప్పటికే కోరామన్నారు. నగదు రహిత లావాదేవీలకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తోందని, ఇప్పటికే ఈ-పోస్ యంత్రాలను విరివిగా సరఫరా చేశామని గుర్తు చేశారు.

దెయ్యాలు స్మశానం నుంచి వచ్చి పెన్షన్ తీసుకెళ్లేవి
అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ పాలన పైన ధ్వజమెత్తారు. ఇప్పుడు పింఛన్లు అందరికీ అందుతున్నాయని, అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దెయ్యాలు స్మశానం నుంచి వచ్చి పెన్షన్ తీసుకు వెళ్లేవని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications