జగన్! జాగ్రత్తగా ఉండు, 120 మావే: బాబు, పవన్ పైన..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేశారు. జాగ్రత్తగా ఉండాలని గురువారం సూచించారు. చంద్రబాబు తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమి ఒత్తిడిలో ఉండి పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు దాడులకు పాల్పడిందన్నారు. తద్వారా ప్రజలను భయభ్రాంతులను చేయాలని చూసిందన్నారు.
కానీ ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోకుండా భారీ పోలింగ్ ఇచ్చారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మీడియా పైన, పోలీసుల పైన, టిడిపి కార్యకర్తల పైన దాడులకు పాల్పడిందన్నారు. కల్తీ మద్యం తాగించి ఐదుగురిని చంపేసిందని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నిబద్ధతతో ఆలోచించి, నిర్భయంగా ఓటేశారన్నారు. జగన్ పార్టీ దాష్టీకాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు.

ఇన్నాళ్లు పులివెందులకే పరిమితమైన రౌడీయిజాన్ని ఆ పార్టీ ఇప్పుడు సీమాంధ్ర మొత్తానికి పాకించే ప్రయత్నాలు చేసిందన్నారు. జగన్ పార్టీ కుయుక్తులను ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. జమ్మలమడుగులో తొమ్మిది ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రసు పార్టీ జీరో అని, ఆ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు. ఓటర్లను జగన్ పార్టీ ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందన్నారు. తాము కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు.
పిచ్చిపిచ్చిగా చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నూటికి పదివేలపాళ్లు తమదే అధికారమన్నారు. తాము తక్కువలో తక్కువ 120 నుండి 130 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంటామన్నారు. అలాగే సీమాంధ్రలో 20 నుండి 22 వరకు లోకసభ స్థానాలను గెలుచుకుంటామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిందన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అందుకే భారీ పోలింగ్ జరిగిందన్నారు. ప్రజలు ముందుకు వచ్చి ఓటేశారన్నారు.
తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీని హెచ్చరిస్తున్నానని చెప్పారు. నూటికి నూరుపాళ్లు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఎవరికీ అనుమానాలు వద్దన్నారు. జీవితంలో కొందరికి ఎదురు దాడి చేయడం అలవాటు అయిపోతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. వారి జీవితాలు అంతే అన్నారు. రౌడీయిజం చేసే వారి మక్కెలు విరగ్గొడితే తప్ప వారికి బుద్ధి రాదన్నారు. పవన్ కళ్యాణ్, మోడీల ప్రచారం కలిసి వచ్చిందన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పవన్ వచ్చారన్నారు.
ఎన్నికల సంఘం, జర్నలిస్టు సంఘాల పైన..
చంద్రబాబు ఎన్నికల సంఘం, జర్నలిస్టు సంఘాల పైన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పైన దాడులు చేస్తే జర్నలిస్టు సంఘాలు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. చిన్న మాట అంటే హడావుడి చేసే జర్నలిస్టు అసోసియేషన్లు... మీడియాపై ఐదు చోట్ల దాడులు జరిగితే ఎటు పోయారన్నారు.
ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. మద్యంను, డబ్బును ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈసిదే అన్నారు. ఎన్నికల కమిషన్ పద్ధతి ప్రకారం పని చేయాలన్నారు.
తాను ఓటేసి బయటకు వచ్చి మాట్లాడితే.. దానిని చూసిన ఈసి వెంటనే ఓటు చెల్లదని ప్రకటించిందని, ఆ తర్వాత తాము వివరణ ఇచ్చామని కానీ, ఇప్పుడు ఇన్ని ఫిర్యాదులు చేసినా ఎందుకు స్పందించలేదన్నారు. ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా వ్యవహరించిందో అర్థం కాలేదన్నారు.












Click it and Unblock the Notifications