జగన్‌కూ ఫోన్ చేస్తా: చంద్రబాబు, రఘువీరాకు ఫోన్
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను ఆహ్వానించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ నెల ఎనిమిదో తేదీన విజయవాడ-గుంటూరు నగరాల మధ్య జరిగే తన ప్రమాణానికి పార్టీ భేదాలు లేకుండా అందరినీ పిలుస్తానని, జగన్‌ను కూడా ఫోన్ చేసి ఆహ్వానిస్తానని చంద్రబాబు బుధవారం ఉదయం ఇక్కడ తమ పార్టీ నేతలకు చెప్పారు.
వామపక్షాల జాతీయ నేతలను కూడా తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని చంద్రబాబు అనుకొంటున్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, సీపీఐ అగ్ర నేత బర్ధన్ తదితరులతో చంద్రబాబుకు వ్యక్తిగత స్థాయిలో మంచి సంబంధాలు ఉన్నాయి. వామపక్షాల నేతలకు ఫోన్లు చేసి ఆహ్వానిస్తానని, ఆహ్వాన పత్రాలను స్వయంగా అందజేసి మరోసారి పిలవాలని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావుకు ఆయన సూచించారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్నట్లు తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, గోవా ముఖ్యమంత్రులు జయలలిత, నవీన్ పట్నాయక్, శివరాజ్ సింగ్ చౌహాన్, పారిక్కర్ ద్రువీకరించారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి చంద్రబాబు ఫోన్ చేసి ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని అంటూ రఘువీరా రెడ్డి చంద్రబాబుకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
టిడిఎల్పీ నేతగా బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ తన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications